తెలంగాణ

telangana

ETV Bharat / state

ముందస్తు యత్నం...ఆరోగ్యం భద్రం! - Vikarabad district Medical officers are preparing to create a public health profile

వచ్చేది వానా కాలం...అంటు వ్యాధులు ప్రబలే కాలం. గ్రామీణ ప్రాంతాల్లో వీటి వ్యాప్తి విపరీతంగా ఉంటుంది. వికారాబాద్‌ జిల్లాది ప్రధానంగా గ్రామీణ నేపథ్యం. కాబట్టి అధికారులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు జాగ్రత్తలతో సన్నద్ధమవుతోంది.

vikarabad district latest news
vikarabad district latest news

By

Published : May 20, 2020, 8:33 AM IST

వికారాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సమాచారం (హెల్త్‌ ప్రొఫైల్‌) తయారు చేయడానికి అధికారులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎం, అంగన్వాడీలతో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీం (ఆర్‌ఆర్‌టీ) ఏర్పాటు చేశారు. వానా కాల వ్యాధుల నుంచి రక్షణతోపాటు భవిష్యత్తులో మెరుగైన వైద్య సేవలందించేందుకు వీరు రూపొందించే నివేదికలు ఉపయోగపడతాయని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు అధికమే...

ప్రతి వర్షా కాలంలో జిల్లాలోని ప్రజలు అంటు వ్యాధుల బారిన పడుతూనే ఉన్నారు. వైద్యాధికారుల లెక్కల ప్రకారం గత సంవత్సరం 190 డెంగీ, చికెన్‌ గున్యా 10, మలేరియా 9 కేసులు నమోదు అయ్యాయి. ఇవి కాకుండా జలుబు, జ్వరం, దగ్గుతో బాధ పడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది.

వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక దృష్టి...

హెల్త్‌ ప్రొఫైల్‌ తయారీలో ప్రత్యేకంగా పిల్లలు, వృద్ధుల (హైరిస్క్‌ గ్రూప్‌) ఆరోగ్య పరిస్థితులపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. వారిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆశా, ఏఎన్‌ఎం, ఆసుపత్రుల వివరాలు వారికి అందుబాటులో ఉండే విధంగా, అవసరమైన చికిత్సలు అందించేందుకు సిద్ధమవుతున్నామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు.

వలస కుటుంబాలపై పర్యవేక్షణ...

లాక్‌డౌన్‌ సమయంలో జిల్లాకు చెందిన సుమారు పది వేల మంది వరకు వివిధ రాష్ట్రాల నుంచి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇటువంటి వారిని రాష్ట్ర సరిహద్దులో గుర్తించి, హోం క్వారంటైన్‌ చేశారు. ఇంటికి వచ్చిన తరువాత ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయనే విషయమై వైద్యారోగ్య శాఖ క్షుణ్ణంగా పర్యవేక్షిస్తోంది.

క్షేత్ర ప్రణాళిక...

కరోనా కట్టడితో పాటు సీజనల్‌ వ్యాధులను అరికట్టడానికి వైద్యాధికారులు ఇప్పటినుంచే ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. జిల్లాలో ప్రజల ఆరోగ్య వివరాల సేకరణకు మొత్తం 642 ఆర్‌ఆర్‌టీ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో 8 సీ-జోన్ల పరిధిలో 84 బృందాలు పనిచేస్తుండగా, మిగతా ప్రాంతాల్లో మరో 558 ఆర్‌ఆర్‌టీ బృందాలు వివరాలు సేకరిస్తున్నాయి. దౌల్తాబాద్‌ మండలంలో అత్యధికంగా 64 బృందాలు ఉండగా, పరిగిలో 55, బొంరాస్‌పేట్‌, తాండూరు 47, వికారాబాద్‌, కుల్కచర్ల, ధారూర్‌లలో చెరో 42 బృందాలు, కోట్‌పల్లి మండలంలో 19 బృందాలు పనిచేస్తున్నాయి. ఏఎన్‌ఎం, ఒక అంగన్వాడీ లేదా ఆశా కార్యకర్త కలిపి ఇద్దరూ ఒక ఆర్‌ఆర్‌టీ బృందంగా కొనసాగుతున్నారు.

* తమ పరిధిలోని గ్రామంలో రోజుకు కనీసం 50 నుంచి 100 నివాస గృహాల్లోని కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులపై వీరు ఆరా తీయాల్సి ఉంటుంది. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు కనిపిస్తే మందులు అందిస్తున్నారు. ఇటువంటి వారిని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో ఈ లక్షణాలు తగ్గకుంటే తదుపరి రక్త నమూనాలు సేకరించి పరీక్షిస్తారు.

మెరుగైన చికిత్సల కోసమే సర్వే...

వచ్చేది వ్యాధుల సీజన్‌ కావడం వల్ల జిల్లా ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకునేందుకు ఇంటింటి సర్వే చేపడుతున్నాం. ఎవరిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నాయో గుర్తించి, మెరుగైన చికిత్సలు అందించేందుకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్నాం.

- దశరథ్‌, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details