వికారాబాద్ జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి కొడంగల్ నియోజకవర్గాల పరిధిలోని 18 మండలాల్లో వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం.. 2,24,883 మంది రైతులు ఉన్నారు. రైతు బీమా పథకం కింద కొత్త వారు నమోదుకు ఈనెల 18 వరకు గడువు విధించడంతో అర్హులంతా వెంటనే తమ పేర్లను నమోదు చేయించుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయా మండలాల్లో కొందరు నమోదు చేసుకున్నారు. కొత్త పట్టా పుస్తకాలు వచ్చిన వారు స్పందించాల్సి ఉంది.
జిల్లాలో ఇప్పటి వరకు 655 రైతు కుటుంబాలకు బీమా పరిహారం అందించినట్లు అధికారులు వివరిస్తున్నారు. 53,608 మందికి కొత్త పాసుపుస్తకాలు వచ్చాయని వీరంతా పథకంలో చేరాల్సి ఉందని చెబుతున్నారు. ఆయా గ్రామాల పరిధిలోని ఏఈఓ పేరు, చరవాణి సంఖ్యను పంపించి బీమా చేయించుకోవాలని సందేశంలో సూచిస్తున్నారు. ఇటీవల చేసిన రెన్యూవల్ ప్రకారం జిల్లాలో 7,234 మంది రైతులు బీమా కోల్పోయారు. వీరంతా 60 సంవత్సరంలోకి అడుగు పెట్టడంతో ఈ పరిస్థితి ఎదురయింది. ఆధార్ కార్డులో తమ పుట్టిన తేదీన తప్పుగా రావడంతో కూడా అర్హత కోల్పోతున్నామని రైతులు వివరిస్తున్నారు.
జిల్లాలో ఇలా
- మొత్తం రైతులు 2,24,883
- నమోదైన వారు 99,815
- కొత్తగా పాసుపుస్తకం వచ్చిన వారు 53,608
- ఇప్పటి వరకు లబ్ధిపొందింది 655