వికారాబాద్ జిల్లాలో 60 కిలో మీటర్ల పొడవునా ప్రవహించే కాగ్నానదిపై మూడు చోట్ల రూ.9.52కోట్ల వ్యయంతో నిర్మించిన ఆనకట్టలు ప్రయోజనకారిగా మారాయి. వృథాగా పోయే నీటిని నిలువరించడంతో తాగు, సాగునీటి వనరుల్లో జలమట్టం పెరగడానికి దోహదపడింది. జిల్లాలోని వికారాబాద్, బంట్వారం, పెద్దేముల్, మర్పల్లి, మోమిన్‌పేట, కోట్‌పల్లి, ధారూర్ మండలాల్లో కురిసిన నీరు వరదగా మారి కాగ్నానదిలోకి చేరింది. దోమ, బొంరాస్‌పేట మండలాల్లో కురిసిన వర్షపు నీరు కాకరవేణి, ఆ తర్వాత కాగ్నానదిలోకి వచ్చింది. కోట్‌పల్లి జలాశయం నిండాక వృథాగా మారిన నీరు కూడా కాగ్నా నదిలోకి చేరింది.
చాలా ఏళ్ల నుంచి కాగ్నానదిలోకి చేరిన వరదను కట్టడి చేసేందుకు ఎలాంటి ఆనకట్టలు లేవు. నీటిని నిలువరిస్తే బహుళ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు భావించారు. ఈ మేరకు 2015లో నీటిపారుదల శాఖ రూ.8.52 కోట్లను వ్యయం చేసి తాండూరు పట్టణ సమీపం పాత తాండూరు కాగ్నానదిపై 280 మీటర్ల పొడవు ఆరు మీటర్ల ఎత్తులో ఆనకట్ట నిర్మాణం చేపట్టింది. తాండూరు పట్టణానికి మూడు కిలో మీటర్ల దూరంలో ఉన్న వీర్‌శెట్టిపల్లి, ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణపూరు గ్రామాల సమీపం కాగ్నానదిపై పంచాయతీ రాజ్‌శాఖ రూ.కోటి వ్యయం చేసి ఏడాది కిందటే రెండు ఆనకట్టల నిర్మాణం చేపట్టింది. ఈ ఏడాది భారీగా కురిసిన వర్షాలకు కాగ్నానది నుంచి దిగువకు వచ్చిన వరద ఆనకట్టలను నింపేసింది.