తెలంగాణ

telangana

ETV Bharat / state

Irregularities in land registration:తమది కాని భూమిని... ఎంచక్కా అమ్మేస్తున్నారు!

Irregularities in land registration: తమది కాని భూమినీ కొందరు ఎంచక్కా అమ్మేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనతో సంబంధం లేకుండా ఆన్‌లైన్‌ దస్త్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఉన్న అవకాశాన్ని తమకు అనువుగా మలచుకుంటున్నారు. ఇది అసలు యజమానుల భూములకు ఎసరు పెడుతోంది. భూ దస్త్రాల ప్రక్షాళనలో చోటుచేసుకున్న తప్పులను సరిచేయకుండానే పోర్టల్‌లో చేర్చడంతో చాలా జిల్లాల్లో ఇలాంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి.

Irregularities in land registration
Irregularities in land registration

By

Published : Dec 3, 2021, 8:18 AM IST

Irregularities in land registration: క్షేత్రస్థాయి పరిశీలనతో సంబంధం లేకుండా ఒకరి భూమిని మరొకరు ఎంచక్కా అమ్మేస్తున్నారు. దీంతో అసలు యజమానులు నిండా మునిగిపోతున్నారు. భూ దస్త్రాల ప్రక్షాళనలో చోటుచేసుకున్న తప్పులను సరిచేయకుండానే పోర్టల్‌లో చేర్చడంతో చాలా జిల్లాల్లో ఈ అక్రమాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వికారాబాద్‌, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే పలు కేసులు వెలుగుచూడగా.. మరికొన్ని జిల్లాల్లోనూ ఉన్నతాధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో విక్రయాలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల బాధితులతో విక్రయిస్తున్నవారు బేరసారాలకు దిగుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఈ తరహా అక్రమాలకు అడ్డుకట్ట వేసే వ్యవస్థ లేదని బాధితులు వాపోతున్నారు.

ఆన్‌లైన్‌లో హెచ్చుతగ్గుల నమోదుతోనే సమస్య..

2017లో చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన అనంతరం ఆన్‌లైన్‌లో సమాచారం నిక్షిప్తం చేశారు. రైతుల పాసుపుస్తకాల్లో ఉన్న భూమి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చే క్రమంలో కొన్ని జిల్లాల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అసలు రైతుల విస్తీర్ణంలో కోత పడి.. ఇతరులకు పెరిగింది. పాసుపుస్తకాలూ అదే మాదిరిగా జారీ అయ్యాయి. అదనపు విస్తీర్ణం నమోదైన కొందరు రైతులు ఇదే అదనుగా భూమిని విక్రయానికి పెడుతుండగా.. మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేరున గిఫ్ట్‌ డీడ్‌లు చేస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు విస్తీర్ణాల్లో కోత పడిన రైతులకు ఆ మేరకు రైతుబంధు నిధులూ అందడం లేదు. 2018లో పాసు పుస్తకంలో పూర్తి విస్తీర్ణం నమోదైనప్పటికీ ఆ తరువాత కోత పడినవారూ ఉన్నారు.

  • వికారాబాద్‌ జిల్లా వికారాబాద్‌ మండలం గొట్టెముక్కలకు చెందిన అనంతయ్య కుటుంబానికి 13.25 ఎకరాలు ఉండగా ఆన్‌లైన్‌లో 10 ఎకరాలు మాత్రమే నమోదయింది. మిగిలిన విస్తీర్ణం మరో వ్యక్తి పేరుపై నమోదైనట్లు గుర్తించారు. ఆ వ్యక్తి ధరణి ద్వారా క్రయవిక్రయాలకు పెట్టారంటూ కలెక్టరేట్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితం కూడా ఇదే మండలంలో ఒకరి భూమి మరొకరి పేరుతో నమోదు కాగా.. విక్రయానికి పెట్టడంతో వివాదం పోలీసు స్టేషన్‌కు చేరింది.
  • నల్గొండ జిల్లా గుర్రంపోడులో అయిదు నెలల క్రితం భూ యజమాని ప్రమేయం లేకుండానే మరొకరి పేరున భూమిని రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్‌ వేటు వేశారు. ఇదే జిల్లాలో గతేడాది ఆఖర్లో పీఏ పల్లి మండలంలో ఆటోమేటిక్‌ సాంకేతికత ఆధారంగా ఒక రిజిస్ట్రేషన్‌ జరిగింది. తాను అప్పటికే విక్రయించిన భూమికి మ్యుటేషన్‌ పూర్తి కాలేదని తెలుసుకున్న ఓ మహిళా రైతు ధరణి పోర్టల్లో స్లాటు నమోదు చేసుకుని తన కూతురి పేరున రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఆ భూమిని కొన్న వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో రిజిస్ట్రేషన్‌ రద్దు చేసి, ఆమెపై చర్య తీసుకున్నారు.

ఆటోమేటిక్‌ రిజిస్ట్రేషన్లతో..

గతేడాది అమల్లోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం.. ధరణి పోర్టల్‌లోని ఎలక్ట్రానిక్‌ రికార్డుల ఆధారంగా ఆటోమేటిక్‌ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. మీసేవా కేంద్రంలో స్లాటు నమోదైతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందితే తప్ప ఆపడానికి ఎవరికీ అధికారం లేదు. పైగా క్షేత్రస్థాయిలో భూ యాజమాన్య హక్కుల పరిశీలన లేకుండానే పోర్టల్‌లో ఉన్న రికార్డు మేరకు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ పూర్తయిపోతోంది. లేని భూమికీ కొందరు పోర్టల్లో వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ఒకవైపు తక్కువ విస్తీర్ణం నమోదైన రైతులు తమకు న్యాయం చేయాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఆటోమెటిక్‌ రిజిస్ట్రేషన్లతో ఆ విస్తీర్ణాలు చేతులు మారుతున్నాయి. ఇలాగే కొనసాగితే హక్కుల విషయంలో న్యాయపరమైన వివాదాలు వస్తాయని భూ చట్టాల నిపుణులు పేర్కొంటున్నారు.

క్రిమినల్‌ కేసుల నమోదుకు యోచన..

ధరణి సమస్యలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశంపై దృష్టి సారించినట్లు తెలిసింది. ఎక్కడైనా తమది కాని భూమిని ఎవరైనా విక్రయించినా, కొనుగోలు చేసినా ఇరువర్గాలపై క్రిమినల్‌ కేసులు నమోదుకు సిఫార్సు చేయడంపై చర్చించినట్లు సమాచారం. రెవెన్యూ సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు తేలినా వారిపై కఠిన చర్యలు తీసుకునే అంశంపైనా సంఘం సమాచాలోచన చేసినట్లు తెలిసింది.

ఇదీ చదవండి:uppal bhagayath plots e- auction: ఉప్పల్‌ భగాయత్‌లో గజం రూ.లక్ష..

ABOUT THE AUTHOR

...view details