తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాళీ భూములపై కన్నేసిన అక్రమార్కులు

తాండూరులో పురపాలిక, రెవెన్యూ స్థలాలపై అక్రమార్కులు కన్నేశారు. ఏ మాత్రం అవకాశం దొరికినా స్థలాలను కబ్జా చేస్తున్నారు. అనంతరం తప్పుడు పత్రాలు సృష్టించి తమవేనని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి దందాలకు అధికారులు అడ్డుకట్ట వేయకపోతే పట్టణంలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలు అన్యాక్రాంతమయ్యే ప్రమాదముంది.

Illegals searching for vacant lands in tandoor, hyderabad
ఖాళీ భూములపై కన్నేసిన అక్రమార్కులు

By

Published : Jul 18, 2020, 9:21 AM IST

తాండూరు పట్టణంలో 25 ఏళ్ల కిందట మున్సిపాలిటీ అధికారులు విశాలమైన స్థలంలో వ్యాపార దుకాణాలను నిర్మించి వేలం పద్ధతిలో ఇతరులకు అప్పగించారు. ప్రతినెల అద్దెను సైతం వ్యాపారుల నుంచి స్వీకరించి ఖాతాలో జమచేశారు. నిధులను వివిధ అభివృద్ధి పనులకు వినియోగించారు. పరిస్థితి సజావుగా సాగిపోతున్న తరుణంలో రెండేళ్ల నుంచి సదరు దుకాణాలు నిర్మించిన స్థలంతో పాటు పరిసరాల్లోని ఖాళీ స్థలం తమదే అంటూ కొందరు న్యాయ స్థానంలో కేసు వేయడంతో, పురపాలిక అధికారులు స్థలం ప్రభుత్వానిదే అంటూ నిరూపించాల్సిన పరిస్థితి నెలకొంది. వివాదంగా మారిన స్థలం విలువ రూ.కోట్ల విలువ చేసేదిగా ఉంది. ఈ స్థలంలో మున్సిపాలిటీ అధికారులు ప్రస్తుతం ఎటువంటి నిర్మాణాలు చేపట్టే వీలు లేదు.

హైదరాబాద్‌ రహదారి వారగా ఇలా

పట్టణంలోని హైదరాబాద్‌ రహదారివారీగా మూడు దశాబ్దాల కిందట ప్రైవేటు వ్యక్తులు కొందరు తమకు చెందిన విశాలమైన స్థలాన్ని నివాస గృహ నిర్మాణాలకు సంబంధించి ప్లాట్లుగా చేసి విక్రయించారు. లేఔట్‌ ప్రకారం ఉద్యానవనం ఏర్పాటుకు 1,450 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించారు. అయితే బోర్డును ఏర్పాటు చేయలేదు. దీంతో నివాస గృహాలకు స్థలాను విక్రయించిన వారే ఉద్యానవన స్థలం తమదే అని ఐదేళ్ల కిందట కబ్జాకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే సదరు వ్యక్తులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాత రికార్డుల ప్రకారం తమదేనని అధికారులు న్యాయస్థానంలో రుజువు చేసి, స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. తాజాగా ఈ స్థలం తమదే అంటూ కొంత మంది వ్యక్తులు కబ్జా చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరికి కొందరు నాయకులు అండగా నిలుస్తున్నారని సమాచారం.

గ్రీన్‌సిటీలో

తాండూరు పట్టణంలోని గ్రీన్‌సిటీలో అత్యధిక ధర పలికే పార్కు స్థలాన్ని అక్రమార్కులు కబ్జాచేశారు. అనంతరం తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. స్థలంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉన్న స్థానికులు పురపాలక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన అధికారులు నిర్మాణాలను రెండేళ్ల కిందట కూల్చివేశారు. స్థలం మున్సిపాలిటీదే అన్నట్లు నామఫలకాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల కొందరు తొలగించారు. అయినా అధికారులు పట్టించుకోలేదు.

చిలుక వాగు పరీవాహక ప్రదేశంలోనూ..

తాండూరు పట్టణంలో పలు కాలనీల మార్గాల్లో ప్రవహించే రెవెన్యూ శాఖ పరిధిలోని చిలుక వాగు ఆరు కిలో మీటర్ల పొడవుంది. ఎక్కడికక్కడ కబ్జాకు గురైంది. దశాబ్దాల నుంచి ఈ విషయంలో స్థానికులు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. కబ్జాచేసిన స్థలాల్లో కొందరు నిర్మాణాలు చేశారు. మరి కొందరు అడిగే వారు లేరని వాగును పూడ్చేసి రహదారిగా మార్చారు. అయినా చర్యలు తీసుకోలేదు. తాజాగా చిలుకవాగు పరీవాహక ప్రదేశం ఎంత మేరకు ఉందనే విషయంలో రెవెన్యూ, నీటిపారుదల, మున్సిపాలిటీ అధికారులు కలిసి సంయుక్త సర్వే చేపడుతున్నారు. పరీవాహక ప్రదేశంలో అక్రమ నిర్మాణాలు జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. పట్టణంలోని గొల్లచెరువు శిఖం భూమి విస్తీర్ణం 40 ఎకరాలకు పైగా ఉంటే అక్రమార్కులు 10 ఎకరాలకు పైగా దశాబ్దాల కిందటే కబ్జాచేశారు. వాటిని ప్లాట్లుగా చేసి ఇతరులకు విక్రయించారు.

హద్దులు నిర్ణయించి కంచె ఏర్పాటు చేస్తాం

పురపాలక సంఘం పరిధి స్థలాలు కబ్జాల చెరల్లోకి వెళ్లకుండా హద్దులను నిర్ణయించి కంచెలను ఏర్పాటు చేస్తాం. ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ విషయంలో ఇప్పటికే పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించాం. అప్పటి వరకు సిబ్బంది నిఘా పెడతారు.

- స్వప్న, ఛైర్‌పర్సన్, తాండూరు పురపాలక సంఘం

ఇదీ చూడండి:-రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!

ABOUT THE AUTHOR

...view details