తెలంగాణ

telangana

By

Published : Aug 17, 2020, 12:57 PM IST

ETV Bharat / state

జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం... 51 ఇళ్లు ధ్వంసం

వికారాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా వానలు విస్తారంగా కురుస్తున్నాయి. ఆదివారం జోరు వానతో ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి వెళ్లలేదు. లోతట్టు పొలాలు బురదగా మారి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కలుపు నివారణ, ఇతర సస్యరక్షణ పనులు చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి.

heavy rains in vikarabad district
ఆ జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం... 51 ఇళ్లు ధ్వంసం

జిల్లాలో నాలుగు రోజుల నుంచి వరద చేరుతోంది. కోట్‌పల్లి జలాశయం అలుగు పారడంతో నాగసుందర్‌, మన్‌సాన్‌పల్లి, రుక్మాపూరు గ్రామాల వాగుల నుంచి ప్రవహించి బిజ్వార్‌, కోకట్‌ గ్రామ సమీపంలో కాగ్నా నదిలోకి చేరుతోంది. తాండూరు-కొడంగల్‌ రహదారి మార్గంలోని వంతెన కింది నుంచి దిగువన పాత తాండూరు, వీర్‌శెట్టిపల్లి, నారాయణపూరు ఆనకట్టల మీదుగా దిగువకు వరద ప్రవహిస్తోంది. అల్లాపూరు, రాములోరి జలాశయాలు నిండి పోయాయి. లక్నాపూరు, సర్పన్‌పల్లి జలాశయాల్లోకి వరద క్రమేపి పెరుగుతోంది. ముసురుతో తాండూరు-వికారాబాద్‌, కరణ్‌కోట, కొడంగల్‌, ఎక్మయి, కోటిపల్లి రహదారులు అస్తవ్యస్థంగా మారాయి. ధారూర్‌ నుంచి రాస్నం వెళ్లే రహదారి మార్గంలోని స్టేషన్‌ధారూర్‌ సమీపంలో కల్వర్టు పూర్తిగా ధ్వంసమవడంతో రాకపోకలు స్తంభించాయి.

ధ్వంసమైన ఇళ్లు
జల పరవళ్లు

దెబ్బతిన్న ఇళ్లు

జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొత్తం 51 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు లెక్కతేల్చారు. వికారాబాద్‌ పట్టణం, సర్పాన్‌పల్లి, బురాంతపల్లి, మర్పల్లి మండలం సిరిపురం గ్రామాల్లో ఒక్కోటి, వికారాబాద్‌ మండలం కామారెడ్డిగూడ పంచాయతీలో మూడు ఇళ్లు, కొటాలగూడెం పంచాయతీలో ఐదు, పరిగి మండలంలో మరో ఐదు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పట్టణాల్లో, గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అవసరమైతే ఖాళీ చేయించి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఎడతెరిపిలేని వర్షం

రైతుల హర్షం

జిల్లాలో పెద్ద ప్రాజెక్టు అయిన కోటపల్లి పూర్తి స్థాయిలో నిండటం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2016 తరువాత ఈ సంవత్సరం పూర్తిగా నిండింది. ఒక్క టీఎంసీ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు కింద 9700 ఎకరాల ఆయకట్టు ఉంది. ధారూరు మండలంలో 4700 ఎకరాలు, పెద్దెముల్ మండలంలో 5000 ఎకరాల ఆయకట్టు ఉంది. నాలుగు సంవత్సరాలుగా ప్రాజెక్టు నిండక పోవడం వల్ల వరి సాగు చేయలేక పోయారు. భారీ వర్షాలతో ఈ సంవత్సరం రెండు పంటలు పండుతాయని ఆనందం వ్వక్తం చేస్తున్నారు రైతులు. చిన్న తరహా ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండగా లక్నాపూరు, సర్పన్‌పల్లి ఇంకా పూర్తి స్థాయిలో నిండలేదు. అల్పపీడన ద్రోణి తగ్గే లోపు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండే అవకాశాలున్నాయి.

నిండిన జలాశయాలు

ఇదీ చదవండి: భారత్​ సత్తా: జాబిల్లిపై ఇళ్ల నిర్మాణానికి అంతరిక్ష ఇటుకలు

ABOUT THE AUTHOR

...view details