వికారాబాద్ జిల్లా పరిగిలో భారీ వర్షం కురిసింది. వడగండ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. గంట పాటు కురిసిన వర్షానికి పలు కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. జాతీయ రహదారిపై వర్షపు నీరు నిలిచింది. వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. శాంతినగర్ కాలనీ, హనుమాన్ ఆలయ సమీపంలో మురుగు నీరు వీధుల్లోకి వచ్చాయి. వివేకనంద చౌరస్తా, బాహర్ పేట్ చౌరస్తాలో భారీగా నీళ్లు రోడ్లపై నిలిచాయి. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. నేషనల్ హైవే కాంట్రాక్టర్లు సరియైన పద్ధతిలో కాలువలు నిర్మించకపోవడం వల్ల నీళ్లు రోడ్లపైనే నిలిచింది.
హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతున్న భాగ్యనగరవాసులకు కాస్త ఉపశమనం లభించింది. వివిధ పనులపై బయటకు వచ్చిన నగరవాసులు.. తడిసి ముద్దయ్యారు. అసెంబ్లీ, బషీర్బాగ్, బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రహదారులపైకి నీరు రావడంతో.. వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షధాటిని తట్టుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రజలు వెతుక్కున్నారు.