వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్షం పడింది. తాండూరులో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన అకాల వర్షంతో స్థానికులకు ఇబ్బందులు తప్పలేదు. రోడ్లపై వరద ఏరులై పారింది. ఆ వరదలో పలుచోట్ల కూరగాయలు కొట్టుకుపోయాయి. కూరగాయలు అమ్ముకుని బతికే చిరువ్యాపారులను ఈ అకాలవర్షం దెబ్బతీసింది. వానకు ప్రధాన రహదారిపై నీరు నిలిచి గల్లీ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో జనాలు అవస్థలు పడ్డారు.
భయాందోళనకు గురిచేసిన వడగండ్ల వాన: పరిగిలో ఏకధాటిగా అరగంటపాటు భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఈ భారీ వడగండ్ల వర్షానికి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పరిగి పరిసర ప్రాంతాల రహదారులపై ఈదురుగాలుల వల్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. స్థానికులు రోడ్లపై వెళ్లేందుకు భయాందోళనకు గురయ్యారు. వడగండ్ల వల్ల అక్కడక్కడ మామిడి తోటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులకు గురయ్యారు.