సీసం(లెడ్), కాడ్మియం, పాదరసం వంటి భారలోహాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) శాస్త్రవేత్తలు తెలిపారు. ఏలూరులో వింత రోగానికి లెడ్, నికెల్ ప్రభావంతో పాటు.. బ్యాక్టీరియా, రసాయన ఎరువులు, పురుగు మందుల ప్రభావం ఉందని ప్రాథమికంగా తేలిందన్నారు. ఈ నేపథ్యంలో భారలోహాలు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్త ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ విభాగాధిపతి డా.బి.దినేశ్‌కుమార్ వివరించారు.
మెదడుపై ప్రభావం..
ఏ రంగు తయారవ్వాలన్నా సీసం తప్పనిసరి ఉండాల్సిందే. ఆడుకునే బొమ్మలో బ్యాటరీలలో సీసం, కాడ్మియం ఉంటుంది. కొంతమంది పిల్లలు బ్యాటరీలను మింగేస్తుంటారు. 14 ఏళ్లలోపు పిల్లల్లో ఇది మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. పిల్లల్లో 100 మిల్లీలీటర్ల రక్తంలో 10 మైక్రోగ్రాములు, పెద్దల్లో 20 మైక్రోగ్రాముల కంటే సీసం పరిమితి ఎక్కువైతే సమస్యలు వస్తాయి. రక్తంలో సీసం కలిస్తే పిల్లల్లో తెలివితేటలు పెరగవు. రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గుతుంది. నరాల బలహీనత వస్తుంది. కండరాలపై ప్రభావం చూపుతుంది. న్యూరో సమస్యలు తలెత్తుతాయి. 5 శాతం కిడ్నీ వ్యాధులకు కారణమవుతాయి. మూర్ఛ, వికారం, తలనొప్పి, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. కిడ్నీలూ దెబ్బతింటాయి.