తెలంగాణ

telangana

ETV Bharat / state

రుణం కరవు.. కౌలు బరువు! - vikarabad district latest news

భూమిని నమ్ముకున్న కౌలు రైతు పరిస్థితి ఆగమవుతోంది. ఎకరాకు రెండు విడతలుగా ప్రభుత్వం రూ.5 వేల చొప్పున అందిస్తున్న పెట్టుబడి రాయితీలో వీరి ఊసే లేకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపు తీయాల్సిన తరుణంలో అప్పులు స్వాగతించనున్నాయి. పెట్టుబడులు అవసరమున్న సమయంలో రుణం కోసం అవస్థలు తప్పడం లేదు. గతంలో రుణ అర్హత కార్డులను అందించాలనే ఆలోచన అటకెక్కింది. దీనికి తోడు నూతనంగా జారీ చేసిన ఈ- పాసు పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహా వాస్తవంగా సాగుదారు(కబ్జా) కాలమ్‌ను తొలగించడంతో వీరి గుర్తింపునకు శాశ్వతంగా అడ్డుకట్ట పడింది.

farmer problems, vikarabad district
రుణం కరవు.. కౌలు బరువు!

By

Published : Apr 2, 2021, 7:00 AM IST

ఇటీవల వెల్లడైన జాతీయ నమూనా సర్వేలో రాష్ట్ర స్థాయిలో సగటున 16.45 శాతం మంది కౌలు రైతులున్నట్లు తేలింది. వికారాబాద్‌ జిల్లాలో 12 శాతం మంది ఉన్నట్లు వ్యవసాయాధికారులు గతంలోనే గుర్తించారు. జిల్లాలో మొత్తం 2.23 లక్షల మంది అన్నదాతలుగా ఉండగా.. వారిలో చిన్నకారు రైతులే ఎక్కువ. కౌలు ఆధారంగా వ్యవసాయం చేస్తున్నవారు సుమారు 26 వేల మంది. భూములున్నా.. సాగు చేయడం కష్టంగా మారుతుండటం, పిల్లల చదువు ఇతరత్రా కారణాలతో పట్టణం బాటపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో కౌలుదారుల సంఖ్య గ్రామాల్లో పెరుగుతోంది.

అందేదెలా..?:

భూమి హక్కులున్నవారికి రుణాలు అందే అవకాశమున్నా.. కౌలుదారుకు మాత్రం అవస్థలు తప్పడం లేదు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో ఇప్పటికే అధికారులు రుణ ప్రణాళికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు రూ.1,250 కోట్ల వరకు రుణాలు అందించేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. జిల్లాలో 1.18 లక్షల మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.55 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో భూములను కౌలు తీసుకునే వారికి సర్కారు తోడ్పాటుపై స్పష్టత లేదు. దీంతో తప్పనిసరైన పరిస్థితిలో ప్రైవేటుగా అప్పు తెచ్చుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎరువులు, విత్తనాల రూపంలో పెట్టుబడికి, దుక్కి కోసం ఎకరానికి ఎంత లేదన్నా ప్రారంభ దశలోనే ఎకరాకు రూ.15 వేల వరకు వ్యయం చేయాల్సి వస్తోంది. కౌలుకు సంబంధించి ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.16 వేలు చెల్లించాల్సి రావడం, ప్రభుత్వ పరంగా ఎలాంటి సాయం అందకపోవడంతో వారి సాగు సమరాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఎటువంటి ఆధారంలేని కౌలుదారులకు బ్యాంకులు, సహకార సంఘాలు కనికరం చూపని దుస్థితి నెలకొంది.

పెట్టుబడికి అవస్థలు పడుతున్నాం

ఐదెకరాల భూమిని కౌలు చేస్తున్న. గతంతో పోలిస్తే కౌలు ధరలు ఆయా భూముల ప్రకారం పెరిగాయి. పంటల పెట్టుబడికి చాలా అవస్థలు పడుతున్నాం. ప్రైవేటు అప్పుల వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు పండక నష్టపోతున్నా పరిహారం అందే ప్రసక్తే లేదు. భూ యజమానుల సమ్మతితో బ్యాంకులు రుణాలు ఇచ్చేలా నిబంధన మారిస్తే మాలాంటి వారికి మేలు జరుగుతుంది.

-రాములు, పుల్‌మద్ది, వికారాబాద్‌

ABOUT THE AUTHOR

...view details