ఇన్నాళ్లూ పిల్లలతో ఆడాలంటే ఏదో ఒక వారాంతం మాత్రమే. కాని ప్రభుత్వాలు ఆదేశాలతో ఇప్పుడు ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో కలిసి గడిపే వెసులుబాటు దొరికింది. తల్లిదండ్రులు, పెద్దవారు పిల్లలతో ఇంట్లో కూర్చుని క్యారమ్స్, చెస్, వామనగుంతలు వంటి ఆటలు ఆడుతూ వారిని ఉత్సాహ పరుస్తూ... పెద్దలు సైతం నూతన ఉత్సాహాన్ని పొందుతున్నారు.
ఒకే కుటుంబానికి చెందిన భార్యా భర్తలు వారి సంతానాన్ని తీసుకుంటే భవన నిర్మాణానికి తండ్రి, వ్యవసాయ పనులకు తల్లి, పాఠశాలకు వారి సంతానం పరుగులు తీసేది. ఇలా ఒకింటి వారే నలుదిక్కుల ఎవరి పనికి వారు వెళ్లేది. పండుగలు, పబ్బాలు, ఇతర శుభకార్యాల్లో సైతం అందరూ కలిసేది చాలా తక్కువ. ఇలాంటి వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు. కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో అని దాని నివారణకు అందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.