వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ సూక్ష్మ కళ, చిత్రలేఖనంలో అబ్బురపరుస్తున్నాడు. పనికిరాని, చవకైన వస్తువులతో కళాఖండాలు తయారుచేస్తూ మన్ననలు పొందుతున్నాడు. సుద్ధ ముక్కలతో ఎన్నో ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు. చింత గింజలపై ప్రపంచదేశాల జెండాలు, బియ్యపు గింజలపై శివలింగం చెక్కారు. కందిపప్పుపై ఆంగ్ల అక్షరాలను చెక్కుతున్నారు. కోడిగుడ్డు పెంకులపై వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు.
రావిచెట్టు ఆకులపై రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తలు, ప్రముఖుల చిత్రాలు వేశారు. కొబ్బరిచిప్పలతో వినాయకుడు, స్కూటర్ లాంటి కళాకృతులు తయారు చేశారు. అగ్గిపుల్లలు, చొప్పబెండ్లు, ఐస్ క్రీమ్ పుల్లలు, టూత్ పిన్నులతో చార్మినార్, ఈఫిల్ టవర్, రామమందిరం లాంటి చారిత్రక కట్టడాల్ని సిద్ధం చేశారు. కాదేదీ కళాఖండానికి అనర్హం అన్నట్లు ఉచితంగా, చవగ్గా దొరికే, పనికిరాని వస్తువులతో ఔరా అనిపిస్తున్నాడు. అశోక్‌కు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనమన్నా, సూక్ష్మ కళన్నా చాలా ఇష్టం. మూడో తరగతి నుంచే అలాంటి బొమ్మల్ని తయారు చేసేవాడు.