Election Campaign in Vikarabad 2023 :వికారాబాద్ జిల్లాలో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగబోతున్నాయి. ప్రధాన పార్టీల మధ్యేకాదు వ్యక్తుల మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రజాక్షేత్రంలో కొట్లాడేందుకు సిద్ధమయ్యాయి. అభ్యర్థులను ప్రకటించకపోవడం వల్ల బీజేపీలో ఇంకా హడావుడి మాత్రం కనిపించడం లేదు. వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్..తాండూరు నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేదు.
Vikarabad Politics Latest News : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం మరోసారి కొడంగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. రేవంత్‌కు పోటీగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికే బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. ఈ నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం ఇంఛార్జిగా మంత్రి మహేందర్ రెడ్డిని నియమించిన గులాబీ దళపతి నాలుగింటికి నాలుగు నియోజకవర్గాల్లో జెండాఎగిరేసే బాధ్యతను మహేందర్ రెడ్డి భుజానికెత్తారు. మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో కారు జోరు కొనసాగుతుందని, కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తమ దగ్గర పనిచేయవని చెబుతున్నారు. తాను పార్టీ మారుతున్నారనే దుష్ప్రచారాన్ని కూడా తీవ్రంగా ఖండించారు.
Telangana Assembly Elections 2023 : వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి మెతుకు ఆనంద్ మరోసారి పోటీ చేస్తున్నారు. లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా స్వగ్రామం కేరెళ్లి నుంచి ప్రచారాన్ని ఆరంభించిన ఆనంద్ ప్రజలతో మమేకమవుతూ.. గులాబీ నేతలతో మంతనాలు సాగిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. మెతుకు ఆనంద్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్‌ను బరిలో దించారు. గత ఎన్నికల్లో మెతుకు ఆనంద్ గెలుపునకు కీలకంగా పనిచేసిన నేతలు కాంగ్రెస్ పంచన చేరడం హస్తానికి కొండంత బలాన్ని ఇస్తోంది. చిగుళ్లపల్లి బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆరు గ్యారంటీలతో ఇంటింటా ప్రచారంతో కాంగ్రెస్ ప్రజల్లోకి వెళుతోంది. బీజేపీ ఇంకా పూర్తిస్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టలేదు.
BRS Campaign in Vikarabad :పరిగి నియోజకవర్గంలో పాత ప్రత్యర్థులే మరోసారి తమ బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కొప్పుల మహేశ్ రెడ్డికే టికెట్ దక్కగా కాంగ్రెస్ నుంచి రాంమోహన్ రెడ్డి పోటీపడుతున్నారు. గత ఎన్నికల్లో మహేశ్ రెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయిన రాంమోహన్ రెడ్డి.. ఈసారి ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టికెట్ ఖరారైనప్పటి నుంచి ఆరు గ్యారంటీలతో గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. మహేశ్ రెడ్డి రెండోసారి గెలిచి సత్తా చాటాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. కార్యకర్తల మద్దతుతో ఊరూరా తిరుగుతూ రాష్ట్రప్రభుత్వ అభివృద్ధి పనులను వివరిస్తున్నారు.