తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్ వేళ.. ప్రసవానికి ప్రయాస లేకుండా! - వికారాబాద్​ జిల్లా తాండూరు వైద్య అధికారులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఈ సమయంలో ప్రసవాలకు వచ్చే గర్భిణులకు సమస్యలు తలెత్తకుండా తాండూరు వైద్య ఆరోగ్య అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. కాబోయే అమ్మలకు అండగా నిలవడానికి వైద్య సిబ్బంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

Breaking News

By

Published : Mar 30, 2020, 2:21 PM IST

లాక్​డౌన్​ సందర్భంగా వికారాబాద్​ జిల్లా వైద్య అధికారులు స్థానిక ఏఎన్‌ఎంల సహకారంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు స్థానికంగా ఉండే ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల వైద్యులు ఆయా కుటుంబాలతో మాట్లాడుతున్నారు. సమయం దగ్గర పడగానే ఆస్పత్రిలో చేర్చేలా బాధ్యత తీసుకుంటున్నారు.

ఒకవేళ అత్యవసరంగా తరలించాల్సి వస్తే వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. వారిని జిల్లా ఆస్పత్రి, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గ కేంద్రాల్లోని ఆస్పత్రులకు పంపించనున్నారు.వారికి వైద్యసాయం అందించి కాన్పు జరిగేలా చూస్తామని జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

సాధారణ రోజులతో పోల్చితే ప్రస్తుతం జిల్లాలోని పద్దెనిమిది మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో గర్భిణులకు మెరుగైన, సత్వర వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

క్షేత్ర స్థాయిలో ఏఎన్‌ఎంలు, వైద్యుల పర్యవేక్షణ

జిల్లాలోని పద్దెనిమిది మండలాలు, నాలుగు మున్సిపాలిటీల్లో ఏప్రిల్‌ 15తేదీ వరకు 1,456 మంది కాన్పు అయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరు ఏయే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్నారో, ఆ వైద్యులకు, ఏఎన్‌ఎం, ఆశకార్యకర్తలకు బాధ్యతలను అప్పగించారు. వీరంతా పట్టణాలు, గ్రామాల్లోని గర్భిణుల ఆరోగ్య పరిస్థితులను ఆరాతీస్తున్నారు. ఈక్రమంలో గ్రామాలకు వెళ్తున్న ఏఎన్‌ఎంలు గర్భిణుల ఇళ్ల వద్దకు వెళ్లి బీపీ, మధుమేహం వంటి వైద్య పరీక్షలు నిర్వహించి తగిన జాగ్రత్తలు, సూచనలు చేస్తున్నారు.

బరువు పరిశీలించి పోషకాహారం తీసుకోవడంపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణుల ఆరోగ్య వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు. ప్రసవ తేదీ గుర్తించి ఆస్పత్రిలో చేరాల్సిందిగా సూచిస్తున్నారు. ఒకవేళ ఇంటి వద్ద ఉండగానే పురిటి నొప్పులు మొదలైతే వారిని ఆరోగ్య కేంద్రాలకు, జిల్లా, నియోజకవర్గ కేంద్రాల ఆస్పత్రికి తరలించేందుకు 102, 108 వాహనాలను వినియోగించాలని నిర్ణయించారు. హైరిస్క్‌ ఉన్న వారిని గుర్తించి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.

గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తున్న ఏఎన్‌ఎంలు

ఏప్రిల్‌ 15 వరకు కాన్పు అయ్యే అవకాశం ఉన్నవారి సంఖ్య 1456

వీరిలో హైరిస్క్‌ ఉన్నవారు 661

శస్త్రచికిత్సలకు సిద్ధం

వికారాబాద్​ జిల్లాలోని పద్దెనిమిది మండలాల్లో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండగా ఇక్కడ సాధారణ కాన్పులు జరిగేలా చూస్తున్నారు. వీటిలో పదిహేను కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు పని చేస్తుండగా, ఏడు కేంద్రాలు ఏకంగా ఇరవైనాలుగు గంటలు కొనసాగుతున్నాయి. వీటిలో ప్రసవాలు చేసేందుకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేశారు. ముందుగానే ఆపరేషన్‌ చేయాలని నిర్ణయించిన వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇలాంటి వారికి ప్రసవం కోసం సిజేరియన్లు చేయనున్నారు. ఎవరికైనా అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాల్సి వస్తే తాండూరు జిల్లా ఆస్పత్రితోపాటు వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లోని ప్రాంతీయ ఆస్పత్రుల్లో సౌకర్యాలను కల్పించారు.

ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు

ప్రసవానికి ఎంతమంది గర్భిణులు ఉన్నారో పీహెచ్‌సీల వారీగా గుర్తించాం. వీరంతా ఇబ్బందిపడకుండా వారివారి తేదీల ప్రకారం ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. వైద్యులు, ఏఎన్‌ఎంల ద్వారా ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్నాం. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేసేందుకు సైతం ఆస్పత్రుల్లో అన్నిసిద్ధం చేశాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. - దశరథ్‌, జిల్లా వైద్యాధికారి

ఇదీ చూడండి:'లాక్​డౌన్​ పొడిగిస్తారనే వార్తలు అవాస్తవం'

ABOUT THE AUTHOR

...view details