తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ కందికి భలే గిరాకీ.. ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి - demand for red grams is giving profits to vendors

వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల్లో కంది సాగు ఎక్కువ. చేతికి వచ్చిన ఉత్పత్తులు తాండూరు విపణికే వస్తాయి. ఇక్కడే విక్రయాలు జరుగుతాయి. వీటికి రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు సరకును నిల్వచేసి పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నారు. రైతులకు మద్దతు ధర మాత్రమే దక్కుతుంటే వ్యాపారులకు బాగానే కలిసి వస్తోందని పలువురు అన్నదాతలు పేర్కొంటున్నారు.

demand for red grams is giving profits to merchants in vikarabad district
వికారాబాద్​ కంది రైతులు

By

Published : Jan 5, 2021, 12:17 PM IST

ఆ కందికి భలే గిరాకీ.. ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి

వికారాబాద్ జిల్లాలో విరివిగా పండే కందులు ఇతర రాష్ట్రాలకు ఎగుమతవుతున్నాయి. జిల్లాలోని అన్ని విపణుల్లో కలిసి ఇప్పటి వరకు 28,000 క్వింటాళ్లు రైతులు విక్రయించారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు దాదాపు 20,000 క్వింటాళ్ల ఎగుమతిచేసినట్లు కొందరు వ్యాపారులు తెలిపారు. మిగిలిన వాటిని వివిధ ప్రాంతాలకు విక్రయిస్తామన్నారు.

తాండూరు విపణిలో రోజువారీగా విక్రయాలు జరిగితే పరిగి, వికారాబాద్‌, మర్పల్లి, బషీరాబాద్‌, కోట్‌పల్లి, కుల్కచర్ల, ధారూర్‌ విపణుల్లో వారాని కోసారి విక్రయాలు జరుగుతున్నాయి. తాండూరు విపణిలో ఇప్పటి వరకు 13000 క్వింటాళ్ల కందులను, మిగిలిన విపణిల్లో 15,000 క్వింటాళ్లను విక్రయించారు. ఒక్కో క్వింటాలుకు రూ.5,200 నుంచి రూ.5,800 చొప్పున ధరను పొందారు. నాణ్యంగా ఉన్న కందులు మాత్రం ప్రభుత్వం క్వింటాకు ప్రకటించిన రూ.6,000 మద్దతు ధరకు మించి రైతుల వద్ద కొనుగోలు చేశారు. వ్యాపారులు అంతకు మించిన ధరతో మిల్లర్లకు ఎగుమతి చేసి లాభాలు గడిస్తున్నారు.

ముమ్మరంగా కోతలు

జిల్లాలో కోతలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. కంది కాయలు ఎండిన మొక్కలను రైతులు కోసి వారం రోజుల పాటు ఆరబెడుతున్నారు. ఆ తర్వాత సహజ పద్ధతిలో కందికాయలను కొమ్మలను కుప్పగా పోసి కర్రలతో కొట్టి గింజలను వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు. మరికొందరు రైతులు యంత్రాల ద్వారా నూర్పిడి చేస్తున్నారు. విపణుల్లో ధరలు లాభదాయకంగా ఉన్నాయనుకుంటే విక్రయానికి తరలిస్తున్నారు.

ఎందుకంటే..

జిల్లాలో వానా కాలంలో సాగు చేసిన కందుల విక్రయాలు ప్రస్తుతం ఊపందుకున్నాయి. రైతులను నుంచి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు తమ దుకాణాల్లో నిల్వ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లోని మిల్లర్ల నుంచి ఆర్డర్లు రాగానే ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి లాభాలను ఆర్జిస్తున్నారు.

మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్రల్లో వానాకాలంలో సాగు చేసిన కంది ఇపుడే చేతికి అందవు. మరో వైపు ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న మిల్లుల్లో పప్పు ఆడించేందుకు కందుల కొరత తీవ్రంగా ఉంటుంది. ఇదే సమయంలో జిల్లాలోని భూముల పరిస్థితిని బట్టి డిసెంబరు మూడో వారం ఆరంభం నుంచి దిగుబడులు చేతికి వస్తాయి. విపణుల్లో కందులను కొనుగోలు చేసే వ్యాపారులతో మిల్లర్లు సంప్రదింపులు జరిపి తమకు కావాల్సిన మేరకు కందులను ఎగుమతి చేయాలని ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా వ్యాపారులకు ఆర్డర్లను ఇస్తున్నారు. ఆ మేరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ఇతర రాష్ట్రాల్లోని మిల్లర్లకు ఎగుమతి చేస్తున్నారు.

జిల్లాలో సాగు ఇలా

  • జిల్లాలోని 18 మండలాల్లోని రైతులు వానాకాలంలో 1,82,913 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. ఇందులో తాండూరు నియోజకవర్గంలోని రైతులు 52,721.5 ఎకరాల్లో సాగు చేశారు.
  • వికారాబాద్‌లో 52,557.02, పరిగిలో 27,075.30, కొడంగల్‌లో 50,559.21 ఎకరాల చొప్పున సాగయింది.
  • అక్టోబరు చివరి వారం వరకు పంట ఆశాజనకంగా ఉండడంతో ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయని రైతులు అంచనా వేశారు. తీరా నవంబరు మొదటి వారంలో కురిసిన వర్షానికి పూత రాలిపోయింది. దిగుబడుల శాతం గణనీయంగా తగ్గిపోయింది.

ప్రస్తుతం ఒక్కో ఎకరాకు 3 క్వింటాళ్ల నుంచి 4 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తున్నాయి. వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడుతున్నారు. కొన్నిసార్లు క్వింటా కందులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.6,000 దాటి ధర లభిస్తుంటే కొన్నిసార్లు తక్కువ ధర లభిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details