వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణి మృతి ఉద్రిక్తతకు దారి తీసింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది, మృతురాలి బంధువుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. డాక్టర్‌పై దాడికి యత్నించడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. చివరకు బాధితులు శాంతించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదిలా ఉండగా.. గర్భిణీని తమ ఆసుపత్రికి తీసుకొచ్చే సమయానికే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లోని పేట్లబురుజులో ఉన్న మోడరన్ గవర్నమెంట్ మెటర్నిటీ ఆసుపత్రిలో సీ సెక్షన్ ఆపరేషన్ చేసుకున్న ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. అంతకుముందు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న నలుగురు మరణించిన విషయం తెలిసిందే.