వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ ఆస్పుత్రిలో ప్రసవం అనంతరం ఓ బాలింత మృతి చెందింది. బషీరాబాద్ మండలం పక్షం నాయక్ తండాకు చెందిన నందిని రెండో కాన్పు కోసం తాండూర్ ఆసుపత్రిలో నిన్న చేరింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. ఈ ప్రసవంలో మగబిడ్డకు జన్మనించింది. ప్రసవానంతరం ఆమెకు రక్తస్రావం కావడంతో హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు నందినిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు మృతదేహంతో ఈరోజు తాండూర్ ఆసుపత్రి ముందున్న ప్రధాన రహదారిపై ధర్నారు దిగారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున్న వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శేఖర్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి కుటుంబ సభ్యులకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు.
ఆ పక్కనే క్యాంప్ కార్యాలయంలో ఉన్న తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున సహాయం అందచేస్తామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ వారు ధర్నా విరమించడానికి నిరాకరించారు. దీంతో ఆర్డిఓ అశోక్ కుమార్ మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మృతురాలి భర్తకు ఆసుపత్రిలో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షలు పరిహారం చెల్లించాలని బంధువులు డిమాండ్ చేశారు .