వికారాబాద్ జిల్లా తాండూరులో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య వర్గ పోరు మరోసారి బయటపడింది. తాజాగా ఇద్దరు నేతల అనుచరులు వారి సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపీణీ కార్యక్రమంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది అధికారిక సమావేశం కావున అధికారులు వేదికమీద ప్రజాప్రతినిధులకు మాత్రమే సీట్లు కేటాయించారు. నామినేటెడ్ పదవులు పొందినవారిని వేదికపైనా కూర్చునేందుకు అనుమతించ లేదు. దీంతో తాండూర్ వ్యవసాయ కమిటీ అధ్యక్షుడు విఠల్ నాయక్, కోట్పల్లి అధ్యక్షుడు ఉప్పరి మహేందర్ తమను ఎందుకు అనుమతించరని తహసీల్దార్‌తో గొడవకు దిగారు. నామినేటెడ్ పదవులు పొందినవారికి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లేదని ఆయన తెలిపారు. ఈక్రమంలో కాసేపు వాగ్వాదం నెలకొంది.