CM KCR on BJP రాష్ట్రంతో పాటు దేశం కూడా బాగుపడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతోందని వెల్లడించారు. వికారాబాద్ జిల్లాకేంద్రంలో నూతన కలెక్టరేట్ భవనం ప్రారంభించిన సీఎం అనంతరం బహిరంగ సభలో కేంద్రం తీరుపై విమర్శలు సంధించారు. కేంద్రమే లక్ష్యంగా సీఎం విమర్శలు ఎక్కుపెట్టారు.
మన కడుపు కొట్టి దోచిపెడుతున్నారు:కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ఎనిమిదేళ్ల పాలనలో ఒక్క మంచి పనైనా చేసిందా అని ప్రశ్నించారు. కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చలు చేపట్టాలని సూచించారు. మోదీ ఈ దేశానికి ఏం చేశారో మీరే చెప్పాలన్నారు. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోందని విమర్శించారు. భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గృహ, వ్యాపార, వాణిజ్య పరిశ్రమలకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చాం:మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి తాగునీరు అందించామని పేర్కొన్నారు. పేదింటి బిడ్డల కోసం కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో రైతులు భూములు అమ్ముకుని హైదరాబాద్‌లో కూలీలుగా పని చేసేవారని తెలిపారు. పల్లె, పట్టణ ప్రగతితో రాష్ట్ర రూపురేఖలు మారడంతో పాటు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. రైతు బంధు ద్వారా వ్యవసాయం సస్యశ్యామలంగా మారిందని పేర్కొన్నారు. రైతు శ్రేయస్సు కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు మరణించిన రైతు కుటుంబానికి నేరుగా రూ.5 లక్షల బీమా ఇస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ స్వార్థ రాజకీయాలకు బలి కాకుండా కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
కేంద్రంలో ఎనిమిదేళ్ల భాజపా పాలనలో ఒక్కటంటే ఒక్క మంచి చేశారా?. కేంద్రంలో భాజపా పాలనపై గ్రామాల్లో చర్చలు చేపట్టాలి. మోదీ...ఈ దేశానికి ఏం చేశారో చెప్పండి. మోదీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయకపోగా ఉచిత పథకాలు వద్దని చెబుతోంది. భాజపా మన కడుపులు కొట్టి బడా వ్యాపారులకు దోచి పెడుతోంది. గతంలో వంటగ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఇప్పుడు ఎంత? భాజపాను నమ్మితే పెద్ద ప్రమాదం. మన రాష్ట్రంలో పరిస్థితి భాజపా పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి గమనించండి. ఈరోజు ప్రధానమంత్రే మనకు శత్రువు అయ్యాడు. - కేసీఆర్, సీఎం