రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. ఈ లోక్‌సభ పరిధిలోని 24 లక్షల మంది ఓటర్లలో కేవలం 53.8 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్‌తో ప్రారంభమైన ప్రక్రియ సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.
ఆసక్తి చూపని పట్టణవాసులు
మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు తక్కువ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలో ఓటింగ్ తక్కువగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఆశించిన స్థాయిలో జరిగింది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లో 60.51 శాతం పోలింగ్ నమోదు కాగా ఈసారి 10 శాతం ఓటింగ్ తగ్గడం గమనార్హం.
ఫలించిన అధికారుల రాయబారం
వికారాబాద్ మండల పరిధిలోని మద్గుల చిట్టంపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయటంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ... ఉదయం అధికారులు నచ్చచెప్పటంతో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
మున్సిపల్ పరిధిలోని లక్ష్మీనగర్ తండాలో తీవ్ర నీటి ఎద్దడి ఉన్నందున ఎన్నికలను బహిష్కరించి ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. నాలుగు గంటల సమయంలో స్థానిక ఎమ్మెల్యే హామీ ఇవ్వటం వల్ల వారు ఓటింగ్‌లో పాల్గొన్నారు.