తెలంగాణ

telangana

ETV Bharat / state

వేడి రాజకీయం: చేవెళ్ల త్రిముఖ పోరులో గట్టెక్కేదెవరు

రాష్ట్రంలో అన్ని లోక్​సభ నియోజకవర్గాల్లో చేవెళ్లది ఓ ప్రత్యేకత. ఓ వైపు పూర్తిగా పట్టణీకరణ. మరో వైపు గ్రామీణ నేపథ్యం. ఇక్కడ రాజకీయాలు కూడా అంతే వేగంగా మారిపోయాయి. పార్టీలు.. అభ్యర్థులను కూడా శ్రీమంతులనే ఎంపిక చేశాయి. కాంగ్రెస్ సిట్టింగ్​నే బరిలో నిలపగా... తెరాస ప్రయోగాత్మకంగా కొత్త అభ్యర్థిని దింపడం వల్ల ఎవరికి దక్కుతుందోనని సర్వత్రా ఆసక్తి కలుగుతోంది.

చేవెళ్లలో వ్యాపారుల పోరు

By

Published : Mar 24, 2019, 10:23 PM IST

Updated : Mar 25, 2019, 7:15 AM IST

చేవెళ్లలో వ్యాపారుల పోరు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల సమ్మిళిత చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బరిలో బలమైన అభ్యర్థులే తలపడుతుండటం వల్ల పోరు రసవత్తరంగా మారింది. గత ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గతేడాది కాంగ్రెస్ గూటికి చేరి రెండోసారి పోటీ చేస్తున్నారు. హస్తం తరఫున పోటీ చేసి ఓడిపోయిన కార్తీక్ రెడ్డి కారెక్కి తెరాస అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి అండగా నిలబడ్డారు.

వ్యాపారం నుంచి రాజకీయాల్లోకి

వ్యాపారాల్లోంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 2014లో తెరాస నుంచి లోక్​సభకు ఎన్నికయ్యారు. నాలుగున్నరేళ్లు తెరాసలోనే కొనసాగిన విశ్వేశ్వర్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు అనూహ్యంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మహేశ్వరం, తాండూరులో హస్తం పార్టీ ఎమ్మెల్యేల గెలుపులో కీలక పాత్ర పోషించి గుర్తింపు చాటుకున్నారు. చేవెళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిత్వం దక్కించుకొన్నారు. గ్రామస్థాయిలో యూత్ కమిటీల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులు అంచనా వేస్తున్న ఆయన... కారు జోరుకు ప్రజలే కళ్లెం వేస్తారని చెబుతున్నారు.

కొండాతో గడ్డం ఢీ

కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ వీడిన తరువాత.. జిల్లాలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి ఓడిపోవడం గులాబీకి పెద్ద దెబ్బ. దీనిని దృష్టిలో ఉంచుకొనే ఆపరేషన్ ఆకర్ష్​కు వ్యూహాలు రచించింది. దశాబ్దాలుగా బలమైన క్యాడర్ ఉన్న సబితాఇంద్రా రెడ్డి కుటుంబంతో మంతనాలు సాగించిన కేటీఆర్... కార్తీక్ రెడ్డితో పాటు రాజేంద్రనగర్, మహేశ్వరం కాంగ్రెస్ కార్యకర్తలను కారెక్కించుకున్నారు. కార్తీక్ రెడ్డిని బరిలో దింపాలనుకున్నప్పటికీ... అనూహ్యంగా 2004 నుంచి పార్టీతో సంబంధాలున్న ఫౌల్ట్రీ వ్యాపారి గడ్డం రంజిత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పట్నం మహేందర్ రెడ్డి అండ, కార్తీక్ రెడ్డి అనుచర వర్గంతో కారు పటిష్ఠమైంది. మెజార్టీ లెక్కలు కాకుండా పక్కా గెలుపు లక్ష్యంతో... గులాబీ జెండా ఎగరవేస్తామని శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

భాజపా నుంచి మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ వియ్యంకుడు జనార్దన రెడ్డి బరిలో నిలిచారు. సికింద్రాబాద్​లో దత్తాత్రేయకు టికెట్ ఇవ్వనందున ఇక్కడ సర్దుబాటు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కార్తీక్ రెడ్డి చేరిక తెరాసకు అనుకూలంగా మారే అవకాశం ఉందని గులాబీ దళం నమ్ముతోంది. ఒంటరి పోరుకు సిద్ధమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ క్యాడర్ పదిలంగానే ఉన్నట్టు విశ్వసిస్తున్నారు. ఇరుపార్టీల అభ్యర్థులు చేవెళ్ల లోక్​సభ ఎన్నికను రసవత్తరంగా మార్చడం వల్ల... ఎవరు గెలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

Last Updated : Mar 25, 2019, 7:15 AM IST

ABOUT THE AUTHOR

...view details