- వారం కిందట వికారాబాద్ పట్టణంలో పేరున్న వ్యాపారికి కరోనా సోకి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని నేరుగా శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురికి సహాయం చేసిన ఆయన చివరి మజిలీకి నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
- వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తల్లికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువర్గం పెద్దఎత్తున్న ఉన్నా, ఎవరూ లేని అనాథగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఇలా.. వికారాబాద్ జిల్లాలో పేరున్న వ్యాపారులు, రాజకీయ నాయకులు కరోనాతో మృత్యువాత పడితే హితులు, సన్నిహితులు, బంధువులు, గ్రామస్థులు హాజరు కావడంలేదు. ఎవరూ లేని వారిలా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రక్త సంబంధీకులు రాలేని పరిస్థితి. వారంతా హృదయంలో వేదన నింపుకొని, కన్నీటిని నివేదిస్తున్నారు. పరపతి, పలుకుబడి ఉన్న పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు ఈ వ్యాధితో మృతి చెందితే అనాథ మృతదేహాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించిన తీరు తాజా పరిస్థితికి అద్ధం పడుతోంది. ప్రస్తుతం ఆ ‘నలుగురు’ కాస్తా దూరం అవుతున్నారు. కడసారి చూపు చూసి, కన్నీరు కార్చే వీలులేకుండా పోయింది. కొవిడ్ రెండోదశ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
దూరంగానే కడసారి చూపు..:బంధువుల్లో ఎవరైనా చనిపోతే కడసారి చూపు చూసి.. చేసిన మంచి పనులు తలుచుకుని కీర్తిస్తారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఎంత గొప్ప వ్యక్తయినా పట్టుమని పది మంది లేకుండానే.. ఊరేగింపు జరగకుండానే కార్యక్రమాన్ని ముగించాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్న పెద్దదిక్కును కోల్పోయినా ఇదే పరిస్థితి. కర్మకాండలకు కూడా ఎవరూ రాని దయనీయ పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి మానవ జీవితాలకు బంధనాలు విధించింది. పెళ్లయినా, చావయినా.. ఏ ఇతర శుభకార్యమైనా అతితక్కువ మందితో ముగించేలా చేసింది.