చదువుకోలేదని వారు అధైర్య పడలేదు. ఎలాగైనా తమ కుటుంబానికి అండగా నిలవాలనుకున్నారు. అక్షరాలు రాయడం నేర్చుకుని మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరారు. సమావేశాలకు హాజరయి అవగాహన పెంపొందించుకున్నారు.. పొదుపు చేస్తూ తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభ్యున్నతి సాధిస్తున్నారు. ఏ అవకాశం వచ్చినా దానిని వదులుకోకుండా వివిధ రంగాల్లో రాణిస్తున్నారు వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట గ్రామ మహిళలు.
2005లో కంది కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. ఓపికతో కేంద్రాలను నడుపుతూ వందల మంది రైతులను సమన్వయం చేస్తూ లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేస్తూ, రూ.కోట్లలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఐకేపీ, మార్కెటింగ్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. యాసంగిలో చేతికి వచ్చిన ధాన్యం కొనుగోలుకు 11 మండలాల్లోని 81 గ్రామాల్లో పొదుపు సంఘాల మహిళల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.
ఆయా గ్రామాల్లో ఆసక్తి ఉన్న సంఘాలు ముందుకొచ్చాయి. ప్రభుత్వం అందించే మద్దతు ధరకు ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోళ్లను కొనసాగిస్తున్నారు. 81 కేంద్రాల్లో 4,419 మంది రైతుల వద్ద 1,41,359.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాకు రూ.32 చొప్పున కమీషన్ ఇవ్వనుండగా రూ.45,23,507 ఆదాయం సంఘాలకు రానుంది. వీటిలో నుంచి నిర్వహణ ఖర్చులు పోను సంఘాల సభ్యులు ఆర్థికాభివృద్ధికి రుణాలు తీసుకోనున్నారు.
మద్దతు ధరలతో రైతులకు అండగా..
ప్రభుత్వం వరి ధాన్యానికి మద్దతు ధరలు ప్రకటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేయటంతో రైతులకు గిట్టుబాటు కలుగుతోంది. ఐకేపీ కేంద్రాలు గ్రామాల్లోని గ్రామైక్య సంఘాల ఆధ]్వర్యంలో కొనసాగటంతో రైతులకు అందుబాటులో ఉంటున్నాయి. తూకాల్లో తేడాలు, కమీషన్ లేకుండా ప్రభుత్వం ఈఏడాదిలో ప్రకటించిన మద్దతు ధర క్వింటాకు రూ.1,835 చొప్పున కొనుగోలు చేయగా డబ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. గతంలో ధాన్యం చేతికొచ్చే సమయాల్లో గ్రామాల్లో మధ్యదళారులు పుట్టుకొచ్చేవారు. రైసుమిల్లుల యజమానులు గ్రామాల్లో దళారి వ్యవస్థను తయారు చేస్తూ, తక్కువ ధరలకు ధాన్యం కొనుగోలు చేసి కమీషన్, తరుగు, హమాలీ పేరుతో ఛార్జీలు వసూలు చేసి, ఆలస్యంగా డబ్బులిచ్చేవారు. సంఘాల నిర్వహణతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.