తెలంగాణ

telangana

ETV Bharat / state

online classes: రేపటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు.. ఏర్పాట్లు పూర్తి! - తెలంగాణ వార్తలు

ఈ విద్యా సంవత్సరంలోనూ ఆన్‌లైన్‌ పాఠాల బోధనకు ప్రభుత్వం ఆదేశించింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు బడుల విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. గతేడాది సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

online classes, vikarabad
ఆన్‌లైన్ తరగతులు, వికారాబాద్

By

Published : Jun 30, 2021, 9:27 AM IST

కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరంలోనూ ఆన్‌లైన్‌ పాఠాలనే బోధించాలని ప్రభుత్వం ఆదేశించింది. వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఒకటి, రెండు తరగతులు మినహాయించి 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన చేయనున్నారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 1, 2 తరగతులకు నిర్వహించాలని యోచిస్తున్నారు. గత విద్యా సంవత్సరం మాదిరి చరవాణి, టీవీల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలను బోధించనున్నారు. ప్రతి విద్యార్థి వారీగా అధికారులు ఇప్పటికే చరవాణి, టీవీ సదుపాయాలున్న వివరాలను ఆరా తీశారు. చరవాణి అందుబాటులో లేనివారికి టీశాట్‌ ఛానల్‌ ద్వారా టీవీల్లో బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. టీవీ లేని విద్యార్థులకు పాఠశాల, పంచాయతీ కార్యాలయాల్లోని టీవీల్లో పాఠాలు వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 150కిపైగా కొనసాగుతున్న ప్రైవేటు పాఠశాలల్లో 20వేలకుపైగా విద్యార్థుల్లో దాదాపు అందరి వద్ద ఆండ్రాయిడ్‌ చరవాణులు ఉండటంతో ప్రైవేటు ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ బోధనకు ఆటంకం లేకుండాపోయింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, నిర్వాహకులు ఆన్‌లైన్‌ బోధనకు సన్నద్ధమయ్యారు. ఈమేరకు విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి సిద్ధం చేశారు.

ప్రతిరోజు ఉపాధ్యాయుల పర్యవేక్షణ

ఆన్‌లైన్‌ పాఠాలను ఉపాధ్యాయులు ప్రతిరోజూ పర్యవేక్షించనున్నారు. యాభై శాతం మంది ఉపాధ్యాయులు బడికి హాజరై విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలు వింటున్నది లేనిది పరిశీలించనున్నారు. చరవాణి, టీవీల సదుపాయాలను కల్పించేందుకు కృషి చేసే బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఆన్‌లైన్‌ పాఠ్యాంశాల్లో విద్యార్థులకు ఎదురయ్యే అనుమానాలు, సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయనున్నారు. అందుకు అవసరమైతే విద్యార్థుల ఇళ్లకు వెళ్లే వీలుంటుంది. చరవాణి ద్వారా విద్యార్థుల హాజరు నమోదు చేయనున్నారు. ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మొదటిరోజు పాఠశాలలను శుభ్రం చేయించాల్సి ఉంటుంది.

పాఠ్యపుస్తకాల పంపిణీలో జాప్యం

గత విద్యా సంవత్సరంలో బడులు తెరిచిన మొదటిరోజునే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈసారి ఆలస్యమయ్యే ఆస్కారముంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో ముద్రణ కార్యాలయం మూతపడింది. ఇప్పట్లో పాఠ్యపుస్తకాలు ముద్రించే పరిస్థితి లేదు. ప్రస్తుతం 52శాతం పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని జిల్లాలోని మండల కేంద్రాలు, గ్రామాల్లోని బడులకు తరలించేందుకు రూ.3లక్షలు ఖర్చవుతుంది. మూడేళ్లుగా ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయకుండా బకాయి పెట్టింది. తాజాగా పాఠ్యపుస్తకాలు తరలించేందుకు అవసరమైన రవాణా ఛార్జీలు, కూలీల ఖర్చులకు అందుబాలులో నిధులు లేకపోవడంతో విద్యాశాఖ అధికారులు చేతులెత్తేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ చూపాల్సి ఉంది.

ప్రతి విద్యార్థిపై దృష్టి పెడతాం

ప్రతి విద్యార్థి పాఠాలు వినేలా ఉపాధ్యాయులతో పర్యవేక్షణ చేయిస్తాం. జులై ఒకటో తేదీ నుంచి 3 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు టీశాట్‌లో ప్రసారమయ్యే పాఠ్యాంశాలను చరవాణి, టీవీల్లో వీక్షించేలా సన్నాహాలు చేశాం. ఆ సదుపాయంలేని విద్యార్థులకు ఎంపీ పంపిణీ చేసిన టీవీల ద్వారా పాఠ్యాంశాలను వీక్షింపజేసేందుకు ఉపాధ్యాయుల్ని ఆదేశించాం. ప్రతిరోజు యాభై శాతం మంది ఉపాధ్యాయులు బడికి హాజరవుతారు.

-రేణుకాదేవీ, జిల్లా విద్యాధికారిణి

  • ప్రభుత్వ పాఠశాలలు: 1,072
  • 3 నుంచి 10 వరకు విద్యార్థులు: 71,966
  • చరవాణి కలిగిన విద్యార్థులు: 27,169
  • అందుబాటులో టీవీలున్న గ్రామాలు: 440
  • ఉపాధ్యాయులు: 3,772

ఇదీ చదవండి:Double Bedroom houses: "పట్టణాల్లో వడివడిగా.. పల్లెల్లో నెమ్మదిగా"

ABOUT THE AUTHOR

...view details