కార్పొరేషన్ రుణాలంటే.. స్వయం ఉపాధి కల్పించే పథకాలు. నిరుద్యోగులకు అండగా నిలిచి.. ఆసరా కావాల్సిన ఈ పథకాలు విద్యావంతులను గొర్రెల, బర్రెల కాపర్లుగా మారుస్తున్నాయి. ట్రాక్టర్ కోసం రుణానికి దరఖాస్తు చేసుకున్న ఓ యువకుడిగి మేకలు మంజూరు చేశారు.
వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలో గిరిజన యువకులు.. గిరిజన కార్పొరేషన్ శాఖలో ట్రాక్టర్, కిరాణం దుకాణాలకు రుణాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. కానీ.. వారికి దరఖాస్తు చేసుకున్న ట్రాక్టర్, కిరాణంషాపు కాకుండా.. మేకలు, పవర్ స్ప్రేయర్లు మంజూరయ్యాయి. ఇదేంటని అధికారులను అడిగితే.. తమకు ఇచ్చిన యూనిట్లలో డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని.. ఇది తమ పరిధిలో లేని విషయమని చేతులెత్తేశారు.
ట్రాక్టర్ అడిగితే.. మేకలొచ్చాయ్..
మర్పల్లి మండలం నర్సాపూర్ పెద్దతండాకు చెందిన విగ్నేశ్ డిగ్రీ చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కరోనా వల్ల జాబ్ పొందలేకపోయాడు. ఏదో ఒక పని చేసి.. తల్లిదండ్రులకు ఆసరా అవుదామనుకున్న విగ్నేశ్.. గిరిజన కార్పొరేషన్లో ట్రాక్టర్ లోన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నాడు. అతడు ట్రాక్టర్ కోసం అప్లై చేస్తే.. 11 మేకలు మంజూరయ్యాయి.
మేకల కాపరిని చేశారు..
"డిగ్రీ చదివినా.. ఉద్యోగం రాలేదు. నిరుద్యోగిగా ఉండలేక.. ఏదో ఒక పని చేద్దామనుకున్నాను. ట్రాక్టర్ కొనుగోలు చేసి వ్యవసాయ పనులు, మట్టి కొట్టడం వంటి వాటికి వెళ్లి ఎంతో కొంత సంపాదించాలనుకున్నాను. కొంతలో కొంతైనా అమ్మానాన్నకు ఆసరా అవుదామనుకున్నాను. కానీ.. ట్రాక్టర్‌కు బదులు మేకలు మంజూరు చేసి.. గ్రాడ్యుయేట్‌ను మేకల కాపరిని చేశారు."
- విగ్నేశ్, బాధిత యువకుడు