తెలంగాణ

telangana

ETV Bharat / state

Women Vaccinated: టీకా తీసుకోవడంలో మహిళలే మేటి - Telangana news

Women Vaccinated: ప్రభుత్వ, వైద్యశాఖ ఆదేశాలను పాటిస్తూ పురుషులతో పోటీ పడుతూ మహిళలు టీకా వేసుకుంటున్నారు. పలు క్లిష్ట సమస్యలను అధిగమించడంలో ముందుండే మేం వ్యక్తిగతంగా మేలు చేకూర్చే టీకా విషయంలోనూ ఒకడుగు ముందుంటామని వికారాబాద్ జిల్లా మహిళలు ఇప్పటికే 95శాతం తీసుకున్నారు.

Vikarabad
వికారాబాద్

By

Published : Dec 28, 2021, 11:05 AM IST

Women Vaccinated: కరోనా.. డెల్టా.. ఒమిక్రాన్‌ ఏదైనా.. వైరస్‌ దరి చేరకుండా ఉండాలంటే టీకా తప్పనిసరి. ప్రభుత్వ, వైద్యశాఖ ఆదేశాలను పాటిస్తూ పురుషులతో పోటీ పడుతూ మహిళలు టీకా వేసుకుంటున్నారు. పలు క్లిష్ట సమస్యలను అధిగమించడంలో ముందుండే మేం వ్యక్తిగతంగా మేలు చేకూర్చే టీకా విషయంలోనూ ఒకడుగు ముందుంటామని జిల్లా మహిళలు ఇప్పటికే 95శాతం తీసుకున్నారు. రెండో డోస్‌ 50 శాతం వేసుకున్నారు. ఈ లక్ష్యాన్నీ పక్షం రోజుల్లోగా పూర్తి చేస్తామని మహిళా సంఘాల సభ్యులు చెబుతున్నారు.

647 గ్రామ సమాఖ్యలు...

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు, 566 గ్రామ పంచాయతీలు, తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ పురపాలక సంఘాల పరిధిలో 647 గ్రామ సమాఖ్యలున్నాయి. వీటిల్లో 14,239 మహిళా సంఘాలు, ఒక్కోదాన్లో 10-12 మంది వరకు మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రతినెలా పొదుపు చేయడం, రుణాలు తీసుకొని చెల్లించడం.. సంఘ అభివృద్ధి కోసం తరచూ సమావేశాలు నిర్వహించడం క్రమం తప్పకుండా చేస్తున్నారు. ఇదే సందర్భంలో సభ్యులందరూ కరోనా టీకా రెండు డోసులు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు ఆయా మండలాల ఏపీఎంలకు, సీసీలకు ఆదేశాలిచ్చారు. ఈ మేరకు మహిళలందర్నీ చైతన్యం చేస్తూ గ్రామ సమాఖ్యలు ప్రతి సభ్యురాలికి వైద్య సిబ్బంది చేత అవగాహన కల్పించి టీకా ఇప్పిస్తున్నారు. శతశాతం టీకాల లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి సంఘం అధ్యక్షులు, సభ్యులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారా.. లేదా అని పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అనధికారికంగా 95శాతానికి పైగానే టీకా లక్ష్యం చేరిందని, రెండో డోసు సైతం 50శాతం దాటిందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.

అవగాహన పెంచుతున్నాం...
మా సంఘంలో పది మంది సభ్యులమున్నాం. నాలుగు నెలల క్రితమే మొదటి డోసు, నెల క్రితం అందరం రెండో డోసు తీసుకున్నాం. మాతో సరిపెట్టక ఇతరులకూ టీకా విషయమై అవగాహన పెంచుతున్నాం. రుణం కోసం, పొదుపు చెల్లించడానికి సమావేశం నిర్వహించుకున్న సమయంలో టీకాలు తీసుకుంటేనే రావాలని ఆర్‌పీలు వివరించారు. మా కాలనీకే వచ్చి వైద్య సిబ్బంది టీకాలిచ్చారు. మా సభ్యుల కుటుంబంలో అందరికీ టీకాలు వేయించేలా చూసుకోవాలని వివరించాం.

-- నవనీత, అధ్యక్షురాలు, శ్రీనివాస పొదుపు సంఘం, తాండూరు

శత శాతం చేరువలో...

జిల్లాలోని పూడూరు, బొంరాస్‌పేట, బషీరాబాద్‌, వికారాబాద్‌ మండలాల్లో మహిళలు రెండో డోసులో శత శాతానికి చేరువలో ఉన్నారు. ఇతర మండలాల్లో 50-65 శాతం లక్ష్యం చేరుకున్నారు. తక్కువ శాతం టీకాలు తీసుకున్న మండలాల్లో వైద్య సిబ్బంది ప్రత్యేక చొరవ తీసుకొని వారి ఇళ్ల వద్దకే వెళ్లి టీకాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తాండూరు, పరిగి, చౌడాపూర్‌, కుల్కచర్ల మండలాల్లో టీకాల శాతం తక్కువగా ఉంది. పక్షం రోజుల్లోగా అన్ని మండలాల్లో శతశాతం టీకాలు ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా మండల ఏపీఎంలు, ఆర్‌పీలు, సీసీలు పేర్కొంటున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి...
ఒమిక్రాన్‌ వైరస్‌ నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను అందరూ పాటించాలి. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరు టీకా రెండు డోసులూ వేసుకోవాలి. గర్భిణులు, దీర్ఘకాలిక సమస్యలున్న వారు సైతం టీకా తీసుకుంటున్నారు. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఏదైనా సమస్య అనిపిస్తే టీకా కేంద్రంలో వైద్య బృందాన్ని సంప్రదించవచ్చు. మహిళలు సమావేశాలు జరుపుతున్న సమయంలో సామాజిక దూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. తోటి మహిళల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేయాలి.

-- పవిత్ర, ప్రభుత్వ వైద్యురాలు

ABOUT THE AUTHOR

...view details