తెలంగాణలోని చారిత్రక రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకునేందుకు చేరువైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. రామప్ప దేవాలయానికి గుర్తింపు వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని వెల్లడించారు. ఈ నెల 25న పారిస్‌లో ఎంపిక కమిటీ తుది సమావేశం జరుగుతుందని తెలిపారు. భారత్ తరఫున వినతులను పరిశీలిస్తుందని చెప్పారు. తర్వాత నిర్ణయం ప్రకటిస్తుందని వివరించారు. ‘రామప్ప’కు సంబంధించిన సమస్త వివరాలను ఇప్పటికే యునెస్కోలోని భారత శాశ్వత ప్రతినిధికి పంపామన్నారు. రామప్ప దేవాలయంలోని సమీపంలో ఉన్న రెండు చిన్న ఆలయాలను రామప్పదేవాలయ ఆస్తి పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాన్ని, బ్రోచర్‌లను అందజేశామని తెలిపారు.
రామప్ప ప్రాంతం పరిరక్షణకు ప్రత్యేక అభివృద్ధి ప్రాధికార సంస్థతో పాటు రాష్ట్రస్థాయిలో నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లోని ప్రాచీన కట్టడాల పరిరక్షణ ప్రణాళిక, పర్యాటక అభివృద్ధి వంటి అంశాలను చూసేందుకు పర్యాటక శాఖ కార్యదర్శిని ఛైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర స్థాయి నిర్వహణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దీనికి సంబంధించిన జీవో ప్రభుత్వం విడుదల చేసిందని వెల్లడించారు. ఈ కమిటీలో కేంద్ర పురావస్తు శాఖ, రాష్ట్ర దేవాదాయశాఖ, నగర ప్రణాళిక, నీటిపారుదల శాఖ అధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. రామప్ప పరిసరాల్లోని చెరువులు, కొండలు, అటవీ భూములను కాపాడటం, సౌందర్యాన్ని రక్షించేందుకు రాష్ట్ర మున్సిపల్ పరిపాలన, నగరఅభివృద్ధి శాఖ వెంటనే పాలంపేట అభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటు చేసింది. రెండు చిన్న దేవాలయాలను రామప్పదేవాలయానికి అందజేస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో తొలి ప్రపంచ వారసత్వ హోదా రామప్పకు దక్కబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం కీలక నిర్ణయాలు