Kaleshwaram Pump House: వరదనీటిలో మునిగిన కాళేశ్వరం పంపుహౌస్‌లోని పంపులు, మోటార్ల పరిస్థితిపై అంచనా వేయడంలో నీటిపారుదలశాఖ నిమగ్నమైంది. అన్ని పంపులను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తోంది. గతంలో మునిగిన కల్వకుర్తి పంపుహౌస్, శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లు, కాళేశ్వరంలో పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన పనులపై నీటిపారుదల శాఖ దృష్టి సారించింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లలో 29 పంపులు, మోటార్లు ఉన్నాయి. గోదావరికి గతంలో వచ్చిన అత్యంత గరిష్ఠ నీటిమట్టానికి మించి వరద రావడంతోపాటు, భారీవర్షాల వల్ల వాగులు, వంకల ప్రవాహం వెల్లువెత్తడంతో మేడిగడ్డలోని 17, అన్నారంలోని 12 మోటార్లు నీటమునిగాయి. కాళేశ్వరం వద్ద గరిష్ఠ వరద 20 గంటలకు పైగా ఉండటంతో పంపుహౌస్‌లోకి నీరు రాకుండా చూడటానికి సిబ్బంది ప్రయత్నించారు. సీపేజీ ఉండటం, వర్షాల వల్ల పైనుంచి వచ్చిన వరద నీటితో మునిగిపోయింది. కల్వకుర్తి పంప్‌హౌస్ మునిగినప్పుడు షాఫ్ట్ దెబ్బతిని లోపలకు నీళ్లు రావడంతో మట్టి తక్కువగా ఉంది.
Kaleshwaram Pump Houses: పునరుద్ధరణకు ఆరు నెలలు? - అన్నారం పంపుహౌస్
Kaleshwaram Pump Houses: గోదావరి మహోగ్రరూపం దాల్చడంతో నీటిమునిగిన కాళేశ్వరంలోని... పంపుహౌస్‌ల పునరుద్దరణకు చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నవంబరు నాటికి తొలి మోటార్‌ను సిద్ధమయ్యే అవకాశం ఉందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టులకు భవిష్యత్‌లో ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని... ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి వెల్లడించారు.
ఇప్పుడు కాళేశ్వరంలో పైనుంచి పంపుహౌస్‌లోకి నీళ్లు రావడంతో బురద ఎక్కువగా ఉంటుందని నీటిపారుదలశాఖ సీనియర్ ఇంజినీర్ తెలిపారు. విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ కాగానే నీటిని తోడటంపై దృష్టి సారించనున్నారు. వరద తగ్గుముఖం పట్టాక.. పంపుహౌస్‌లో దారులు మూసేసి నీటిని బయటకు తోడతారు. తర్వాత మోటార్లను బయటకు తీసి మొదట బురద అంతా కడగాలి. తర్వాత మంచినీళ్లతో కడగటం, ఆరబెట్టడం వంటి దశలుంటాయి. అవసరమైతే కొన్ని కొత్త పరికరాలను కొనుగోలు చేయాలి. వీటన్నిటికీ సమయం పడుతుందని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మోటార్లను పరీక్షించాలి. మొదటి మోటారును నవంబరు నాటికి సిద్ధం చేస్తామని, తర్వాత ఒక్కోదానికి వారం, పది రోజుల సమయం తీసుకొంటుందని, అన్నింటి పునరుద్ధరణకు ఆరు నెలలు పట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. మేడిగడ్డ పంపుహౌస్‌లో రిటైనింగ్ వాల్ దెబ్బతిందని, ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆ వర్గాలు తెలిపాయి. కల్వకుర్తిలో నీట మునిగిన 5పంపులను మళ్లీ నడిపించడానికి రూ.50 కోట్లు ఖర్చయినట్లు తెలిసింది. కానీ ఇక్కడ కొట్టుకొచ్చిన బురద చేరడంతో ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుందని, ప్యానల్‌బోర్డులు దెబ్బతింటే పునరుద్ధరణకు అధిక వ్యయం తప్పకపోవచ్చని నీటిపారుదలశాఖ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో పంపుహౌస్‌లోకి నీళ్లు రాకుండా చేపట్టాల్సిన చర్యలపైనా కసరత్తు చేయాలని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్, ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి ఒకట్రెండు రోజుల్లో పంపుహౌస్‌లను పరిశీలించనున్నట్లు తెలిసింది.
ఇవీ చదవండి: