YS Sharmila: తెలంగాణలో వందల కోట్ల విలువైన భూములను తెరాస కార్యాలయాలకు రాష్ట్రప్రభుత్వం అక్రమంగా కట్టబెడుతుందని వైతెపా అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. దళితులకు, పేదవారికి పంపిణీ చేయడానికి దొరకని భూములు.. తెరాస కార్యాలయాలు నిర్మించుకోవడానికి మాత్రం దొరుకుతుందా అని ఆమె ప్రశ్నించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పొలేనిగూడెం, బేతవోలు, చెన్నారిగూడెం మీదుగా పాదయాత్ర చేపట్టారు.
బంజారాహిల్స్లో రూ.110కోట్ల విలువైన భూమిని తెరాస కార్యాలయం కోసం కేవలం రూ.5లక్షలకు రిజిస్ట్రేషన్ చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మందు బాంబులు తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలతో గ్రామపంచాయతీ నిర్వహణ చేయాలని ఇటీవల ఓ మంత్రి అనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో తెరాస పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని షర్మిల పేర్కొన్నారు.