తుంగతుర్తి వైతెపా అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది దళితులేనని ఆమె తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో వైతెపా ఆధ్వర్యంలో జరిగిన 'దళితభేరి' సభకు షర్మిల హాజరయ్యారు. దాదాపు 400 మంది ఎస్సీలు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయారని ఆమె వెల్లడించారు. ఆటపాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఎస్సీలేనన్నారు.
ఎస్సీ నేతకు సీఎం పదవి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని షర్మిల విమర్శించారు. ఎస్సీ ఐఏఎస్‌లనూ కేసీఆర్ అవమానించారన్న షర్మిల... ఆ అవమానాలతో ఐఏఎస్‌లు ముందే రిటైర్ అయ్యారని ఆరోపించారు. ఎస్సీలకు మూడెకరాలు ఇస్తారా లేదా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వైఎస్సార్ పాలనలో ముగ్గురు ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ పాలనలో ఎస్సీలపై దాడులు 800 శాతం పెరిగాయన్నారు. అడ్డగూడూరు పీఎస్‌లో ఎస్సీ మహిళను లాకప్‌డెత్ చేస్తే చర్యలేవని ఆమె ప్రశ్నించారు.
హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళితబంధును ప్రకటించారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రాష్ట్రంలో ఒక్కో ఎస్సీ కుటుంబానికి కేసీఆర్ రూ.61 లక్షలు బాకీ ఉన్నారని ఆమె అన్నారు. రాష్ట్రంలో అధికార పక్షం మాత్రమే కాదు ప్రతిపక్షాలు కూడా అలాగే ఉన్నాయని మండిపడ్డారు. ఎస్సీల ఇంట్లో భాజపా నేత భోంచేశారంటే అక్కడ ఎన్నికలున్నట్లు అని ఆమె విమర్శించారు. వైఎస్సార్ హయాంలో ఎస్సీల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఆయన బాటలోనే ఎస్సీల వర్గీకరణకు వైతెపా కట్టుబడి ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.
ఏడేళ్ల కేసీఆర్ పాలనలో దళితులకు చేయని మోసం లేదు.. చేయని అవమానం లేదు. మూడు ఎకరాల భూమి ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు.. వారికే ఖర్చు చేస్తానన్నాడు.. చేశాడా?. దళితుల కోసం పోరాడిన, రాజ్యాంగం రాసిన అంబేడ్కర్ గారంటే కూడా కేసీఆర్‌కు లెక్కలేదు. కేసీఆర్ అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి ఐదేళ్లయింది. దళిత ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లంటే విలువ లేదు. దళిత నాయకులంటే లెక్కే లేదు. -వైఎస్ షర్మిల, వైతెపా అధినేత
YS SHARMILA: తుంగతుర్తి వైతెపా అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ప్రకటించిన షర్మిల ఇదీ చదవండి: Congress: కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్‌గా షబ్బీర్ అలీ