భర్తను ప్రేమగా చూసుకునే ఆడవాళ్లు చాలామంది ఉంటారు. కానీ కట్టుకున్న వాడిని ఓ కన్నతల్లిగా ఆదరించి, ప్రేమించే వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. ఆ కోవకు చెందిన వారే పార్వతి. జన్యుపరమైన వ్యాధి వల్ల దివ్యాంగుడైన రవిని వివాహమాడిన పార్వతి అప్పటి నుంచి అతడికి కాళ్లు, చేతులు తానే అయింది. రవి చంకలో రెండు పలకలు ఉంటేనే కూర్చోగలడు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. బిందు(8), మహేశ్(6).
పదేళ్ల వరకు అందరిలా చురుగ్గానే ఉన్న రవి.. ఓ రోజు కిందపడి తొంటి విరిగింది. దాని తర్వాత కాళ్లు, చేతులు, నడుము ఒక్కొక్కటిగా పడిపోయి దివ్యాంగుడయ్యాడు. అనారోగ్యం వల్ల అతడు ఏ పని చేయలేడు. ఇటు భర్తను, అటు పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత పార్వతిదే. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మున్యానాయక్ తండాకు చెందిన ఈ కుటుంబం.. అక్కడే ఉంటే బతుకుదెరువు ఉండదని.. ఉపాధి కోసం హైదరాబాద్‌కు చేరుకుంది.
నగరంలోని చంపాపేట నెహ్రూనగర్‌లో రవి-పార్వతి దంపతుల కుటుంబం నివాసముంటోంది. వారు నగరానికి వచ్చిన కొన్నిరోజుల్లోనే కరోనా విజృంభించడం.. ఇక్కడున్న వారి ఉపాధే పోవడం వల్ల వారికి బతుకుదెరువు దొరకలేదు. అప్పటి నుంచి వారు తిండి కోసం అల్లాడుతున్నారు. ఉపాధి దొరకకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించడం పార్వతికి కష్టమవుతోంది. పని దొరకకపోవడం వల్ల కుటుంబాన్ని కష్టపెట్టలేని రవి.. నగరంలోని పలు కూడళ్లలో భిక్షాటన చేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లల్ని చదివించి ప్రయోజకుల్ని చేయాలనుకుని నగరానికి వస్తే.. తిండి కూడా పెట్టలేని దుస్థితి వచ్చిందని వాపోతున్నారు. ప్రభుత్వం, మానవతావాదులు తమ పరిస్థితిపై దయతలిచి సాయం చేయాలని వేడుకుంటున్నారు.
"పదేళ్లప్పటి నుంచి నా జీవితం దుర్భరంగానే ఉంది. అయినా నేను ఆత్మవిశ్వాసం కోల్పోకుండా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని నెట్టుకొస్తున్నాను. నా అదృష్టం కొద్ది పార్వతి నా జీవితంలోకి వచ్చింది. తాను నా లైఫ్‌లోకి వచ్చినప్పటి నుంచి.. నేను దివ్యాంగుడిననే భావన తొలిగిపోయింది. తను నన్ను చంటిబిడ్డలా చూసుకుంటోంది. రత్నాల్లాంటి ఇద్దరు బిడ్డలను ఇచ్చింది. వారి కోసం.. నా పార్వతి కోసం ఏదైనా చేయాలని.. వారిని బాగా చూసుకోవాలని హైదరాబాద్‌కు వచ్చాం. కానీ కరోనా వల్ల మా జీవితాలు అల్లకల్లోలం అయ్యాయి. ఉపాధి దొరకలేదు. తిండి కూడా కరవైంది. భార్యాబిడ్డలను పోషించుకోవాలని బిచ్చగాడిగా మారాను."
- రవి, దివ్యాంగుడు