సూర్యాపేట జిల్లా నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన గద్దల వెంకటేశ్వర్లు, స్వప్నకు ముగ్గురు సంతానం. అందులో రెండో వాడు గద్దల యశ్వంత్. ప్రస్తుతం ఆరో తరగతి పూర్తైంది. యశ్వంత్ పుట్టిన కొన్నాళ్లకే నిమోనియాతో ఆస్పత్రిలో చేరాడు. యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడటం వల్ల రియాక్షన్ అయి మాటలు రాకపోవడమే కాకుండా చెవులు వినపడటం లేదు. అప్పటి నుంచి కుమారుడి భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఆందోళన తల్లిదండ్రులను కలచివేసింది. ఎలాగైనా సరే కొడుకును బాగా చదివించాలనుకొని పాఠశాలకు పంపించారు. తోటి విద్యార్థులతో ఇబ్బందులు కలిగాయి. అది తట్టుకోలేక తనలాంటి పిల్లలున్న పాఠశాలకు పంపించాలని హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో అక్షయ్ ఆకృతి పాఠశాలలో చేర్పించారు.
ఎన్నో బహుమతులు గెలిచాడు...
యశ్వంత్‌కు మాటలు రాకపోయినా రాసి చూపిస్తాడు. చెవులు వినపడకపోయినా మనం చెప్పేది అర్థం చేసుకొని సమాధానం చెప్తాడు. చదువులో రాణిస్తూనే సాంసృతిక పోటీలలో పాల్గొంటున్నాడు. పాఠశాలలో ఎన్నో బహుమతులు కూడా గెలుచుకున్నాడు. చిన్నప్పటి నుంచే యశ్వంత్‌కు బొమ్మలు వేయడం ఇష్టం. వేసవి సెలవుల్లో ఇంటికొచ్చినప్పుడు అట్ట ముక్కలతో ఇంట్లో వాడే పాత్రలు లాంటివి తయారు చేసే వాడు. ప్రస్తుతం యూట్యూబ్‌లో చూస్తూ అగ్గిపెట్టలు, అగ్గిపుల్లలు, వాడి పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలతో అందమైన ఆకృతుల్లో బొమ్మలు తయారు చేస్తున్నాడు. అంతేకాకుండా తోటి పిల్లలకు నేర్పిస్తున్నాడు.