శాసనసభ ఎన్నికల్లో తెరాస తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థుల సంఖ్య కొంతమేర తగ్గినా ప్రజల ఆదరణ పొందింది. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ కారు జోరు కొనసాగించింది. ఎన్నిక ఏదైనా తమదే విజయం అనేంతగా గులాబీ దళం దూసుకెళ్తోంది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి నినాదమే గెలుపు మంత్రంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక తెరాసకు సవాల్ విసిరింది. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడం.. ఉత్తమ్ పద్మావతి తాజా మాజీ ఎమ్మెల్యే అవడంతో తెరాసకు గట్టిపోటీ ఇస్తుందని అంచనా వేశారు. వాటన్నింటినీ చిత్తుచేస్తూ కారు విజయదుందుబి మోగించింది.
కేటీఆర్.. అన్నీ తానై...
తెరాస కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టిన తర్వాత కేటీఆర్.. అన్ని బాధ్యతలు తనపైనే వేసుకుని పార్టీని ముందుకు నడుపుతున్నారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక విషయంలోనూ ఇదే జోరు కొనసాగించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంతోపాటు ఓ బృందాన్ని నియమించారు. పూర్తి సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టారు.