చుట్టూ అడవి.. ప్రకృతి అందాల మధ్య సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి 68 కి.మీ.దూరంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రం అయిన... శ్రీ ఇష్ట కామేశ్వర సమేత స్వయంభూశంభులింగేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి రోజు స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నుల పండువగా జరుపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏటా శివరాత్రి సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది.
మేళ్లచెరువు ఆలయ విశిష్టత..
దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆలయల్లో మేళ్లచెరువు ఆలయం ఒకటి. ఇక్కడి శివలింగం వెనుకవైపు జడ ఆకారాన్ని పోలిన గుర్తులు ఉండటంతో... భక్తులు శంభులింగేశ్వర స్వామిని అర్ధనారిశ్వరునిగా కొలుస్తారు. ఈ శివలింగం పైభాగంలో గాట్లు ఉంటాయి. వెనుక భాగంలో మూడు వేళ్లు పట్టే రంధ్రం ఉంటుంది. దీన్నే గంగమ్మ స్థానం అంటారు. ఈ రంధ్రంలో జలం ఉంటుంది. కానీ ప్రవహించదు. జలాన్ని తీస్తున్నకొద్దీ జలం వస్తుంది. దీనినే భక్తులకు ప్రసాదంగా వినియోగిస్తారు.
ఆలయ స్థలపురాణం..
శ్రీ ఇష్ట కామేశ్వర సమేత స్వయంభూశంభులింగేశ్వర స్వామి ఆలయం 12వ శతాబ్దంలో నిర్మించబడిందని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులతో కూడి ఉండేదని స్థానికులు తెలుపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పశువుల కాపరులు అడవికి పశువులను తీసుకొచ్చి మేపుకొనే పోయేవారని తెలిపారు. పశువుల అన్నింటిని ఒక చోట కట్టేసి ఉంచడానికి కొట్టాన్ని ఏర్పాటు చేశారు. ఆ మందలోని ఓ ఆవు ప్రతి రోజు అక్కడి గుండ్రయి మీద పాలు అభిషేకిస్తూ ఉండటాన్ని పశువుల కాపరి గుర్తించి... పల్లె పెద్దలకు తెలియజేయడానికి బయలు దేరుతాడు.
అదే రోజు రాత్రి పరమశివుడు పల్లె పెద్దలైన గంగబోయిన మంగన్న, బోయన్నలకు కలలో కనిపించి తను గుండ్రాయి రూపంలో కొట్టంలో ఉన్నానని... నాకు ఆలయం నిర్మించి పూజలు చేయాలని అన్నారు. శివుని కోరిక మేరకు చిన్న ఆలయాన్ని వారు నిర్మించారు. కాకతీయ రాజైన ప్రతాప రుద్రుడు ఆలయాన్ని అభివృద్ధి చేశాడని శాసనాల ద్వారా తెలుస్తుంది. పూర్వ కాలంలో దీని చుట్టూ పెద్ద చెరువు ఉండేదని... దాని చుట్టూ మేడి చెట్లు ఉండేవని స్థానికులు తెలిపారు. దీని పూర్వకాలంలో మేడిచేరువుగా పిలిచేవారు. కాల క్రమంలో మేళ్లచెర్వుగా స్థిరపడిందని స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి:అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకిన కిరణాలు