Crop Damage: అన్నదాత ఆశలపై నీళ్లు చల్లిన అకాల వర్షం crop damage in telangana: ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా పడుతున్న వడగళ్ల వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా లక్షా ముప్పై వేల ఎకరాలకు పైగా పంట నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా శివంపేట, నర్సాపూర్, వెల్దుర్తి మండలాల్లో వడగళ్ల వాన.. రైతులను నిండా ముంచింది. నర్సాపూర్ మండలం అచ్చంపేట, నారాయణపూర్, బ్రాహ్మణపల్లి, శివంపేట మండలం పంబండ, భీమ్లా తండా, రత్నాపూర్, కొత్తపేట, రూపుల తండా, లింగోజిగూడ, పిల్లుట్ల, తాళ్లపల్లి తండాల్లో వడగళ్ల వాన దెబ్బకు వరి పొలాలు దెబ్బతిన్నాయి. వీటిని నర్సాపుర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి.. అధికారులతో కలిసి పరిశీలించారు. పంట నష్టం వివరాలతో నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు.
ధాన్యానికి మొలకలు..:సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ ఐకేపీ కేంద్రంలో దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. 5 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడంతో వర్షం దెబ్బకు ధాన్యం తడిచిపోతున్నాయని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. బస్తాకి అడుగు భాగాన ఉన్న ధాన్యం మొలకలు వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన మిల్లులకు తరలించాలని కోరుతున్నారు. నల్గొండ జిల్లాలో పలు ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని మిల్లులకు తరలించాలంటే లారీ డ్రైవర్లు బస్తాకు రెండు రూపాయల చొప్పున డబ్బులు డిమాండ్ చేస్తున్నారని రైతన్నలు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఈదురు గాలుల ప్రభావానికి ధాన్యం రాశులపై కప్పిన పట్టాలుసైతం కొట్టుకుపోవడంతో ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి. పండించిన పంటను మార్కెట్లో విక్రయించాలంటే అన్నదాతకు సవాల్‌గా మారింది.
ధాన్యం తడిసి ముద్దవుతున్నాయి:పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వీరికి మద్దతు పలికిన బీజేపీ నాయకులు రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేశారు. కనీసం టార్పలిన్ పట్టాలు ఇవ్వకపోవడంతో భారీ వర్షాలకు ధాన్యం తడిసి ముద్దయిందని ఆవేదన చెందుతున్నారు. ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందనే కారణంతో పది రోజులుగా అధికారులు ధాన్యం కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా ఈదురుగాలులతో కురిసిన వర్ష ప్రభావానికి వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. వీటితో పాటు కూరగాయల పంటల్లోకి నీరు చేరి పాడయ్యాయి. అకాల వర్షాలు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. నేలవాలిన వరిని పైకిలేపి కట్టలు కట్టి ఉప్పు ద్రావణం పిచికారి చేసుకున్నట్లయితే గింజలు మొలకెత్తకుండా ఉంటాయని, కొంతమేర పంట కాపాడుకోవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
పెట్రోల్ బాటిల్ పట్టుకుని రైతన్న ధర్నా: ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. మాక్లూర్ మండలం అడవి మామిడిపల్లి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం సంచులతో బైఠాయించిన రైతులు రాస్తారోకో చేశారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఓ రైతు పోలీసు కాళ్లకు నమస్కరించి మద్దతు ఇవ్వాలని కోరాడు. రెంజల్ తహసీల్దార్ కూడలి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. పెట్రోల్ డబ్బాతో ఓ రైతు ధర్నాలో పాల్గొన్నాడు. కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద రైతులకు మద్దతుగా బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. నాగిరెడ్డిపేట్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తేమ పేరుతో బస్తాకు 7కిలోలు తరుగు తీసుకుంటున్నారని రైతులు ఆరోపించారు. బోధన్ పరిధిలో తడిచిన ధాన్యాన్ని ఆరబోయడానికి అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. రెంజల్, సాలురు మండలాల్లో ధాన్యం తడిసి మొలకెత్తింది.
ఇవీ చదవండి: