బౌద్ధమతానికి చెందిన అద్భుతమైన, అతి ప్రాచీనమైన వారసత్వ సంపదకు ఆపద వాటిల్లుతోంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరి గుట్టపై 60 ఏళ్ల క్రితమే తవ్వకాల్లో వెలుగుచూసిన బౌద్ధారామం, బయల్పడిన విశిష్ట శిల్పాలు, రకరకాల స్తూపాలు, పురాతన వస్తువులు నిరాదరణ నీడన మగ్గుతున్నాయి. ఫణిగిరిలో 150 అడుగుల ఎత్తయిన సర్పాకార గుట్టపై 1941లో అర్కియాలజీ శాఖ తవ్వకాలు జరపగా అతి ప్రాచీన బౌద్ధారామం వెలుగులోకి వచ్చింది. అనంతరం 2001 నుంచి 2010 వరకు, 2019 ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రెండు దఫాలుగా తవ్వకాలు జరిగాయి. ఈ ప్రాంతంలో బుద్ధుడు నడయాడినట్లు.. విద్యాబోధన, విహారానికి అనువైందిగా గుర్తించినట్లు శాసనాలు చెబుతున్నాయి.
PHANIGIRI GUTTA: బుద్ధుడు నడచిన నేల.. శీతకన్నేల! - telangana news
సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 60 ఏళ్ల క్రితమే అద్భుతమైన, అతి ప్రాచీనమైన వారసత్వ సంపద తవ్వకాల్లో బయటపడింది. 150 అడుగుల సర్పాకార గుట్టపై.. బుద్ధుడు నడియాడాడని అధికారులు చెబుతున్నారు. అలాంటి అద్భుతమైన వారసత్వ సంపదకు ఆపద వాటిల్లుతోంది.
దేశంలోనే అత్యంత పురాతన బౌద్ధారామాల్లో ఇదొకటని, ఒకటో శతాబ్దానికి చెందినదని పురావస్తుశాఖ అధికారులు నిర్ధారించారు. జరిపిన తవ్వకాల్లో మహాస్తూపం, బౌద్ధుల ఆవాసాలు, ప్రార్థన స్తూపాలు, బుద్ధుడి ప్రతిమలు, గౌతముడి జీవత ఘట్టాలను మలచిన అపురూప శిల్పాలు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, మహావీరుల కాలం నాటి నాణేలు, మట్టి, సున్నపు బొమ్మలు, మట్టిపాత్రలు, ఇనుప వస్తువులు బయల్పడ్డాయి. ఇలాంటి అపురూప సంపదను ప్రత్యేకంగా పరిరక్షించాల్సిన అధికారులు.. దాన్ని ఫణిగిరిలోని ఓ శిథిల భవనంలో ఉంచి ‘మమ’ అనిపించుకున్నారు. ఫలితంగా అది క్రమంగా శిథిలమవుతోంది. ఈ సంపదను కాపాడుతూ మ్యూజియాన్ని అభివృద్ధి పరచాలనే ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చడం లేదు.
ఇదీ చూడండి:RAMAPPA TEMPLE: కాకతీయుల ప్రాభవానికి ప్రతీక.. రామప్పగుడి!