తెలంగాణ

telangana

ETV Bharat / state

America Accident: పక్షం రోజుల్లో ఇంటికి రావాల్సిన విద్యార్థులు అమెరికా రోడ్డు ప్రమాదంలో.. - హియో స్టేట్​లో రోడ్డు ప్రమాదం

ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని మరో పక్షం రోజుల్లో కన్నవారి చెంతకు చేరతామనే ఆనందంలో ఉన్నారు. తల్లిదండ్రుల కోసం కొత్త బట్టలు కూడా కొన్నారు. అమ్మానాన్నలకు ఈ విషయం చెప్పి సంతోషపరిచారు. అదే ఆనందంలో షాపింగ్​ మాల్​ నుంచి ఇంటికి పయణమైన వారి ప్రయాణం విషాదంగా ముగిసింది. కన్నవారికి గుండె కోత మిగిలింది.

telugu students died in accident at america
telugu students died in accident at america

By

Published : Nov 28, 2021, 10:20 PM IST

America road Accident: విదేశాల్లో ఉన్నత విద్య పూర్తిచేసుకుని తిరిగొస్తాడాని.. గంపెడు ఆశలతో ఎదురు చూస్తోన్న తల్లిదండ్రులకు గుండెలు పగిలే వార్త చేరింది. మరో పక్షం రోజుల్లో వస్తున్నాని చెప్పిన కుమారుని కోసం వేయి కళ్లతో వేచి చూస్తోన్న ఆ కన్నవారికి తీరని వేదనే మిగిలింది. బయలుదేరానన్న మాట వినాల్సిన ఆ అమ్మానాన్నలు.. కలలో కూడా ఊహించని వార్త విని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న కారు అమెరికాలోని ఒహియో స్టేట్​లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు బ్రైన్​డెడ్​ అయ్యారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి దంపతుల కుమారుడు చిరుసాయి(22) ఎంఎస్ కోసం జనవరిలో అమెరికాలోని ఒహియోకు వెళ్లాడు. ఈ నెల 9న మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేశాడు. డిసెంబర్ 15న స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. నిన్న షాపింగ్ చేసి తల్లిదండ్రులకు కొత్త బట్టలు కూడా కొన్నాడు. ఈ విషయాన్ని అమ్మానాన్నలతో పంచుకున్నాడు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సహచర విద్యార్థులతో కలిసి షాపింగ్ చేసిన సాయి.. ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. అప్పటివరకు అంతా సంతోషంగా సాగిన అతని జీవిత ప్రయాణం.. రోడ్డు ప్రమాదం రూపంలో దేశం కాని దేశంలో ముగిసిపోయింది.

సాయి ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా కురుస్తున్న మంచు కారణంగా.. వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనుక సీట్లో కూర్చున్న చిరుసాయి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండకు చెందిన సహా విద్యార్థిని జీవమృతురాలు(బ్రెయిన్ డెడ్) అయినట్లు సమాచారం. మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసి వారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మృతుడు చిరు సాయిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా భారత్​కు రప్పించేందుకు భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర్​రావు ప్రయత్నాలు చేస్తున్నారు. కుమారుడు తిరిగొచ్చిన తర్వాత బంధువులతో కలిసి వేడుక జరుపుకోవాలనుకున్న తల్లిదండ్రులకు గర్భశోకం మిగిలింది. కుమారుడిని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ కన్నవారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details