'బతుకుల్లో బూడిద'
సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ వద్ద 30 రైస్ మిల్లులు అనునిత్యం పొగ, బూడిద, రసాయన పదార్థాలను వెదజల్లుతూ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ఈ రైస్ మిల్లర్లకు ఐదు కిలోమీటర్ల దూరంలో గాలి ఎటు వీస్తే అటు కాలుష్యం వెదజల్లుతోంది. ఈ రైస్ మిల్లుల నుంచి వెలువడే తవుడు, పొట్టు, బూడిద సమీప గ్రామాలను కమ్మేస్తున్నాయి. భారీగా వెలువడుతున్న వ్యర్థాలు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి.
రైస్‌మిల్లులకు నిబందనలు పట్టవా?
రైస్ మిల్లర్ల నుంచి వెలువడే కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పరిసర ప్రాంత ప్రజలు వాపోతున్నారు. వాతావరణం కలుషితం కావడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అంటున్నారు. కాలుష్య నివారణ కోసం ఏర్పాటు చేసుకోవాల్సిన రైస్ మిల్లర్లు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెబుతున్నారు. నిబంధనలు పాటించని రైస్‌మిల్లులను మూసివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.