సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్ గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణానికి అధికారులు సామాన్యుల భూమిని స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ఉన్న శిఖం భూముల్లో ఎవరిది ముట్టుకోకుండా.. పంట పండితే గానీ పబ్బం గడవని పరిస్థితుల్లో ఉన్న సామాన్యుల భూమిని బలవంతంగా ఆక్రమించారు. పోలీసుల బందోబస్త్తో చుట్టూ రాళ్లు, కంచె వేసి మొక్కలు నాటారు.
నిబంధనలు తుంగలో తొక్కి
నిబంధనల ప్రకారం పల్లె ప్రకృతి వనానికి.. కేవలం ఐదు గుంటలు కావాలి. కానీ చివ్వెంల రెవెన్యూ అధికారులు పల్లె ప్రకృతి వనానికి 3.30 ఎకరాల భూమిని కేటాయించారు. వీకే పహాడ్, సేవాలాల్ తండా, లక్ష్మీనాయక్ తండాతోపాటు అనుబంధ గ్రామాలు పందిబండ తండా, బడి తండా, ఉనికి తండాలకు సంబంధించిన ప్రకృతి వనాలు ఒకేచోట ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో వీకేపహాడ్ భూమిని ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన దూదేకుల కుటుంబాలు వారి ముత్తాతల కాలం నుంచి సర్వే నంబర్ 239,246లలో ఉన్న 15 ఎకరాల భూమిలో సాగు చేస్తున్నారు. ప్రకృతి వనం కోసం చివ్వెంల రెవెన్యూ అధికారులు ఆ భూమిలో 3.30 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు.