Suryapet Medical Employee Murder Case :సూర్యాపేటలో ఆదివారం జరిగిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగిహత్య కేసును పోలీసులు చేధించారు. ఆస్తి కోసం ఆమె సోదరుడే హత్య చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని సీతారాంపురానికి చెందిన అనుములపురి స్వరూపారాణి ఈ నెల 5న తలకు తీవ్ర గాయమై ముఖం, ఛాతి పాక్షికంగా కాలిపోయి స్నానపు గదిలో రక్తపు మడుగులో పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఘటానస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. :పెన్‌పహాడ్ మండలం అనాజిపురం గ్రామానికి చెందిన రాజకుమార్.. తన చెల్లెలు స్వరూపారాణి వద్ద పదేళ్ల క్రితం తన తండ్రి పేరున ఉన్న 300 గజాల ప్లాట్ దస్త్రాలు కుదువపెట్టి రూ.50 వేలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని, ప్లాట్ కాగితాలు తిరిగి ఇవ్వాలంటూ ఆరు నెలలుగా సోదరుడు అడుగుతున్నాడు. 'తండ్రి సంపాదించిన ఆస్తిలో తనకూ సమాన వాటా ఉంటుందని, ఇచ్చిన డబ్బులకు వడ్డీ లెక్క కడితే నీ వాటాకు లెక్క సరిపోతుందని' సోదరి స్వరూపారాణి బదులు చెబుతూ వస్తోంది. ప్లాట్ కాగితాలు ఇవ్వకపోవడంతో చెల్లెలిపై కోపం పెంచుకున్న సోదరుడు రాజకుమార్.. ఆమెనుహత్య చేసి కాగితాలతో పాటు ఆమె వద్దనున్న బంగారాన్ని అపహరించాలని నిర్ణయించుకున్నాడు.
అందులో భాగంగానే ఈనెల 5న సాయంత్రం సమయంలో సీతారాంపురంలోని సోదరి ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉందని తెలిసిన తర్వాత ఇనుప కడ్డీతో తలపై విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె మెడకున్న పుస్తెలతాడు తీసుకొని, అక్కడున్న వస్త్రాలకు నిప్పంటించి ముఖంపై వేసి, విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు నమ్మించాలని ప్రయత్నించాడు. అనంతరం అక్కడి నుంచి తిరిగి తన స్వగ్రామానికి వెళ్లాడు.