ఉమ్మడి నల్గొండ జిల్లాలో 72 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లో జిల్లా ఆసుపత్రులున్నాయి. 8 అర్బన్ హెల్త్ సెంటర్లు, 5 ఏరియా ఆసుపత్రులున్నాయి. ఉమ్మడి జిల్లాలో 34,88,809 మంది జనాభా ఉంది. ఇందులో 17,29,037 మంది మహిళలున్నారు. ఇందులో అధికులు పేదలే. మహిళలు గర్భం దాల్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పేదలంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం కేసీఆర్ కిట్టు పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేసుకున్న మహిళ బిడ్డకు జన్మనిస్తే రూ.13వేలు, మగబిడ్డకు జన్మనిస్తే రూ.12వేల ఆర్థిక సాయం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు.
తొలుత రెండుసార్లు వైద్య పరీక్షలు చేసుకుంటే రూ.3వేలు, ఆసుపత్రులో ప్రసవమైన తరువాత రూ.5 వేలు, లేదంటే రూ.4 వేలు ఇస్తారు. తొమ్మిది నెలల వరకు పెంటా వాలెంట్ సూదులు ఇప్పిస్తే రూ.2 వేలు, తట్టు (మీజిల్స్) టీకాలు ఇప్పిస్తే రూ.3 వేల ఆర్థ్ధికసాయాన్ని నేరుగా సంబంధిత మహిళా బ్యాంకు ఖాతాలో జమచేసేలా పథకాన్ని కొనసాగిస్తున్నారు.