సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో జరిగిన అపశ్రుతితో... జిల్లా యంత్రాగం అపప్రద మూటగట్టుకుంది. 5 వేల మంది కూర్చునే లక్ష్యంతో నిర్మించిన గ్యాలరీ... 3 వేల పైచిలుకు ప్రేక్షకులకే కూలిపోవడం గమనార్హం. పనుల నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు ఏమాత్రం పట్టింపు లేనట్టుగా వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ క్రీడగా గుర్తింపు పొందిన కబడ్డీని ప్రోత్సహించే ఉద్దేశంతో మంత్రి జగదీశ్‌రెడ్డి... జాతీయ క్రీడలు సూర్యాపేటలో జరిగేలా కృషి చేశారు. ఆయన మాతృమూర్తి స్మారకార్థం ఎస్. ఫౌండేషన్ పేరుతో ఈ క్రీడలకు ఏర్పాట్లు చేశారు.
అనుభవం లేని గుత్తేదారుకు అప్పగింత
ప్రమాద సమయంలో స్టేడియంలో సుమారు 4వేల మందిలోపు ప్రేక్షకులు ఉండగా... ఎంతమందికి గాయాలయ్యాయన్న వివరాలను అధికారులు చెప్పలేకపోతున్నారు. వివిధ ఆస్పత్రుల్లో సుమారు 160 మందికిపైగా చేరగా... అధికారులు మాత్రం 20 నుంచి 30 మందికి గాయాలయ్యాయని చెబుతున్నారు. కిందపడినవారిలో పైకి కనిపించని అంతర్గత గాయాలైనవారు వందల సంఖ్యలో ఉన్నారు. తీవ్రగాయాలతో హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నవారే 34 మంది ఉన్నట్లు సమాచారం. పెళ్లి మండపాలు నిర్మించే వ్యక్తికి ఇంతటి పనులను అప్పగించడమే ప్రమాదానికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.