సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అటువంటి నేత్రాలు ప్రతిఒక్కరికీ చాలా అవసరం. అందుకే సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం శ్రీరంగాపురానికి చెందిన మల్లు సత్యనారాయణ రెడ్డి కళ్లులేని వారి పట్ల కాంతిరేఖగా నిలుస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ తన దృఢ సంకల్పాన్ని కోల్పోకుండా ముప్పై ఏళ్లుగా నేత్రదానంపై విస్తృత ప్రచారం చేస్తూ యువతీయువకుల్లో ఉత్తేజం నింపుతున్నారు. ఇప్పటివరకు 428 నేత్రాలనూ దానం చేయించి... మరో 11,000 మంది వద్ద నేత్రదానం హామీ పత్రాలను స్వీకరించి ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆలోచన ఎలా?
విజయవాడకు చెందిన దివంగత పార్లమెంట్ మాజీ సభ్యురాలు చెన్నుపాటి విద్య మనుమరాలు చనిపోవడంతో ఆమె కళ్లను 11ఏళ్ల బాలునికి దానం చేశారనే వార్త... మల్లు సత్యనారాయణ రెడ్డిని ఆలోచింపజేసింది. మరణానంతరం మన కళ్లను చూపులేని వారికి దానం చేస్తే వారి జీవితాల్లో వెలుగు నింపుతుందనే ఆలోచనని వెంటనే ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకొని చాలా మందిని విజ్ఞప్తి చేశారు. కొందరు ఆయన మాటలు పట్టించుకోకపోగా... హేళన చేస్తూ అవమానించేవారని తెలిపారు.
సంచలన నిర్ణయం
తాను బతికుండగానే నేత్రదానం చేసి... అవగాహన కల్పించాలని అనుకున్నారు. కంటి వైద్యులను సంప్రదించగా... బతికుండా నేత్రదానం చేయరాదని వారు చెప్పినట్లు పేర్కొన్నారు. పదకొండు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసి కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. ఆయన భార్య సోమమ్మ కూడా కమిటీలో సభ్యురాలిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చూపులేనివారి కోసం మరణానంతరం కళ్లను దానం చేయాలని ప్రచారం చేస్తున్నారు.
హేళన చేసేవారు