తెలంగాణ

telangana

ETV Bharat / state

successful farmer: 'నాది సేంద్రియ పంట.. నేను చెప్పిందే ధర' - తెలంగాణ 2021 వార్తలు

ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి పంటలు పండించేందుకు సిద్ధమయ్యాడు. తనకిష్టమున్న రంగంలో కాలుమోపిన అతను సేంద్రియ పంటలు పండించి లక్షలు సంపాదిస్తున్నాడు. అంతేనా జాతీయస్థాయి పురస్కారానికి కూడా ఎంపికై అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అతనెవరో తెలుసుకుందామా...?

successful-farmer-suryapeta-venkateshwarlu-story
నాది సేంద్రియ పంట.. నేను చెప్పిందే ధరంటా..

By

Published : Jul 18, 2021, 10:10 AM IST

ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తే చాలని ఎక్కువమంది యువత భావిస్తుంటారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించినా గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నామని రైతులు బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ పంటల సాగుతో లాభాలు ఆర్జిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులుగూడేనికి చెందిన వెంకటేశ్వర్లు. తాజాగా ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికై తన ప్రత్యేకతను చాటారు. తాను పండించే పంటలకు ముందే ధరలు నిర్ణయించి అమ్మకాలకు ఒప్పందాలు చేసుకుంటున్నందున నష్టాలు లేవని ఆయన ‘ఈటీవీ-భారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ వివరాలివీ..

సేంద్రియ వ్యవసాయం ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఎలా ఆకర్షితులయ్యారు?

11 ఏళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నా. అంతకుముందు విద్యుత్‌ సంస్థలో కాంట్రాక్టు బిల్‌ కలెక్టర్‌గా పనిచేసేవాడిని. అరకొర జీతంతో కుటుంబం గడవక ఇబ్బందులు పడేవాడిని. దాంతో విసుగు చెంది నా సొంత భూమి 12 ఎకరాల్లో వ్యవసాయం మొదలుపెట్టా. ఒకసారి సూర్యాపేటలో సుభాష్‌ పాలేకర్‌ ప్రకృతి సేద్యం విధానంపై సదస్సు పెట్టారు. దానికి హాజరు కావడంతో కొంత ఆసక్తి కలిగింది. తరువాత ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో పాలేకర్‌ నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరయ్యా. అప్పటినుంచి సాగులో రసాయనాల వినియోగం పూర్తిగా మానేయాలని నిర్ణయించుకున్నా.

ప్రకృతి సేద్యంలో దిగుబడులు భారీగా రావంటారు కదా..

పాలేకర్‌ చెప్పినట్లుగా జీవామృతం మాత్రమే ఎక్కువగా వాడి రెండేళ్లు సాగుచేశా. దిగుబడి పెద్దగా రాలేదు. సేంద్రియ ఎరువులు, వేపపిండి, నూనెమిల్లుల్లో నూనె తీశాక మిగిలే వ్యర్థాల చెక్కను తెచ్చి పంటలకు వేయడం ప్రారంభించా. దిగుబడులు పెరిగాయి.

ఏది ఎంత వాడతారు? ఖర్చు ఎంతవుతోంది?

ఒక ఎకరానికి వేపపిండి 2 క్వింటాళ్లు (రూ.4 వేలు), నూనెచెక్క 2 క్వింటాళ్లు (రూ.5వేలు), సేంద్రియ పశువులపేడ ఎరువు 4ట్రాక్టర్లు (రూ.8వేలు) వేస్తున్నాను. కూలీలకు రూ.10 వేల వరకూ ఖర్చవుతోంది. మొత్తం ఎకరానికి రూ.30 వేల అదనపు పెట్టుబడి అవుతోంది.

పంటలను ఎలా అమ్ముతున్నారు..

సేంద్రియ పంటల కొనుగోలుదారులు నా దగ్గరకు వచ్చి ధర ఒప్పందం చేసుకుంటారు. ఇప్పుడు బొప్పాయి కోతకు వచ్చింది. కిలోకు రూ.12చొప్పున ఇస్తామని వ్యాపారులు ముందే ఒప్పందం చేసుకున్నారు. గతేడాది పలు రకాల కూరగాయలు సాగు చేశా. సాగుకు ముందే హైదరాబాద్‌లోని ఓ దుకాణం వారు ఒప్పందం చేసుకున్నారు. ఏడాది పొడవునా వారే వాహనం పంపి తీసుకెళ్లారు.

ఇదీ చూడండి:పారిశుద్ధ్య కార్మికురాలు.. డిప్యూటీ కలెక్టరయ్యింది!

ABOUT THE AUTHOR

...view details