తెలంగాణ

telangana

ETV Bharat / state

కొంగు బంగారంగా కాళికామాత.. రెండో కలకత్తా కాళికగా ప్రసిద్ధి..! - kaalikamatha temple

250 ఏండ్ల చరిత్ర కలిగిన దేవాలయం, భక్తులు కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు. రెండో కలకత్తా కాళిగా భావించే భక్తులు వెరసి కాళికామాత అమ్మవారి ఆలయం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి కూతవేటు దూరంలో చిలుకూరు మండలం జానకినగర్ తండాలో వెలిసింది, 250 ఏండ్ల చరిత్రతో నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలందుకుంటుంది.

historical kaalikamatha temple
కాళికా మాతా దేవాలయం, సూర్యాపేట

By

Published : Mar 28, 2021, 5:43 PM IST

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే మొదటి కాళికామాత అమ్మవారి దేవాలయంగా సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం జానకినగర్ తండాలో వెలసిన కాళికామాత దేవాలయం ప్రసిద్ధిగాంచింది. మొదట చిన్న బుట్టలో వెలసిన అమ్మవారు నేడు పెద్ద దేవాలయంలో పూజలు అందుకుంటుంది.

కలరా వ్యాధి ప్రబలి...

250 ఏండ్ల క్రితం జానికినగర్ తండా వాసులు రాజస్థాన్ నుంచి వలస వచ్చారు.. అదే సమయంలో ఈ ప్రాంతంలో కలరా వ్యాధి ప్రబలి పశు పక్ష్యాదులతో పాటు.. ప్రజలు కూడా మరణించారు. రాజస్తాన్​లోని మంజి నాయక్ పూర్వీకులు ఈ కాళికామాత అమ్మవారిని పూజించేవారు. కలరాతో ప్రాణాలు కోల్పోతున్న సమయంలో మంజి నాయక్ కాళికామాత ఉన్న వెండి నాణెమును బుట్టలో పెట్టి పూజించడం మొదలెట్టారు. దీంతో ఈ ప్రాంతాల్లో నెలకొన్న కలరా వ్యాధి అంతమైనట్లు ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అనాటినుంచి నేటి వరకు అంచెలంచెలుగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమ్మవారిని పూజించుకుంటున్నారు. మంజి నాయక్ నుంచి తరాలు మారుకుంటు నేడు నాలుగో తరం వారసులు నేడు దేవాలయ పూజారులుగా వ్యవహరిస్తున్నారు.

దీపావళి నాడు జాతర...

ప్రతి సంవత్సరం దీపావళి పర్వదినం నిండు అమావాస్య నాడు మూడు రోజులపాటు జాతర ఘనంగా నిర్వహిస్తాం. ఈ జాతరకు భక్తులు గుంటూరు, కృష్ణ, ఉమ్మడి నల్గొండ, వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్​తో పాటు.. విజయవాడ, రాజస్థాన్, కోల్ కతా, నాందేడ్ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా కాళికామాత అమ్మవారు ఇక్కడ ప్రసిద్ధి.

---------- భట్టు దేవ కృష్ణ, ఆలయ పూజారి

కాళికామాత కృపతోనే మేము ఉన్నత స్థాయిలో ఉన్నాము. 250 ఏండ్ల క్రితం చిన్న పెట్టెలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని ప్రస్తుతం 80లక్షల విరాళాలు సేకరించి నూతన దేవాలయాన్నీ నిర్మించుకున్నాం. ప్రతి శుక్రవారం, అమావాస్య రోజున ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహిస్తారు.

-----------కరమ్ చంద్, గ్రామస్థుడు

ఇదీ చదవండి:'బంగాల్, అసోం తొలి విడతలో భాజపాకే పట్టం'

ABOUT THE AUTHOR

...view details