ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అంటారు. ఇదే కోవకు చెందుతారు నల్గొండ జిల్లాకు చెందిన ఎన్నారై షేక్ చాంద్ పాషా. మాతృభూమికోసం తనవంతుగా ఏమైనా చేయాలన్న తపనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులను గుర్తించి చదువుకు సాయపడుతున్నాడు. దేశ పురోగతికి విద్య మూలమని గుర్తించి బిగ్‌హెల్ఫ్ ఫర్ ఎడ్యూకేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. రెండు వేలమందికి విద్యాదానం చేస్తున్నారు.
చిన్ననాటి స్నేహితుడి జీవితమే స్ఫూర్తిగా
చాంద్పాషాను చిన్నతనంలో తన స్నేహితుడికి వచ్చిన ఇబ్బంది కలిచివేసింది. ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో మిత్రుడు చదవలేకపోవడం ఆవేదనకు గురిచేసింది. మరెవరూ అలా ఇబ్బంది పడకూడదని చిన్నప్పుడే అనుకునేవాడు. కానీ అప్పుడు సాధ్యం కాదు కదా! అందుకే జీవితంలో స్థిరపడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కలిగిన వారిని గుర్తించి వారి ఉన్నత విద్యకు చేయూత అందిస్తున్నాడు.
హైదరాబాద్ కూకట్ పల్లి కేంద్రంగా నడుస్తున్న బిగ్ హెల్ఫ్ సంస్థ ఉమ్మడి తెలుగు రాష్టాల్లోని 800 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం ఆరు రాష్ట్రాల్లో 2,000 మంది విద్యర్థులు సాయం పొందుతున్నారు. ఈ సంస్థ తమ జీవితాల్లో వెలుగు నింపిందని ఎందరో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.