పులిచింతల నిర్మాణంలో ఆది నుంచీ లోపాలే కనిపిస్తున్నాయి. డిజైన్ ఖరారు మొదలుకొని పనుల వరకూ అన్నింటిలోనూ సమస్యలే. ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిపుణుల కమిటీ లోపాలను ఎత్తిచూపినా నీటి పారుదలశాఖ చూసీచూడనట్లు వ్యవహరించింది. బయటపడ్డ లోపాలను సవరించే ప్రయత్నం చేయకపోవడంతో కొత్త ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయగానే గేటుకు నష్టం వాటిల్లింది. నిల్వ చేసిన విలువైన నీటిని వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి పారుదలశాఖ సమాచారం ప్రకారం పులిచింతలలో 24 గేట్లను అమర్చారు. ఒక గేటుకు ఇంకో గేటుకు పొంతన లేదన్నది నిపుణుల అభిప్రాయం. గేట్లను అమర్చడానికి నిర్మించే పియర్స్‌లో ఒక గేటుకు, ఇంకో గేటుకు మధ్య గ్యాప్ గరిష్ఠంగా ఆరు మిల్లీమీటర్లకు మించి ఉండరాదని, కానీ పులిచింతలలో 400 మిల్లీమీటర్లకు పైగా ఉందని పనులను పరిశీలించిన నిపుణుడొకరు తెలిపారు.
పియర్స్ మధ్య తేడా ప్రభావం గేట్ల మీద పడిందని, ఒక పియర్‌కు ఇంకో పియర్‌కు మధ్య ఎడం మాత్రమే కాదు, పియర్స్‌లో తేడాలను గుర్తించినట్లు నిపుణులు తేల్చారు. కాంక్రీటు నాణ్యత, మెకానికల్ పనుల అలైన్‌మెంట్.. ఇలా అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించాలని’ ఓ సీనియర్ ఇంజినీరు వ్యాఖ్యానించారు. డ్యాంలో ఐదారు మీటర్ల నీళ్లు నింపగానే సీపేజీ ప్రారంభమై గ్యాలరీ నిండా నీళ్లే. పది మీటర్ల వరకూ నింపితే అక్కడివరకూ గ్యాలరీ నిండిపోయిందని గతంలో ప్రాజెక్టు అధికారిగా వ్యవహరించిన ఓ ఇంజినీరు తెలిపారు. గ్రౌటింగ్ చేయకపోవడం వల్లే సమస్య తలెత్తినట్లు గుర్తించి ప్రభుత్వ అనుమతితో తర్వాత పనులు చేశారు. జరిగిన ఘటన ఆశ్చర్యకరం కాదని, ఊహించినదేనని ఇప్పటికైనా అన్ని గేట్లనూ నిశితంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఓ సీనియర్ ఇంజినీరు వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుపై అధ్యయనం చేసి సాగునీటిరంగ నిపుణులిచ్చిన నివేదిక బుట్టదాఖలైంది.