Private Schools Fee Hike in Telangana : సూర్యాపేటకు చెందిన బండపెల్లి నాగరాజుకు ఒక కుమారుడు ఉన్నాడు. అతను యూకేజీ పూర్తి చేశాడు. దీంతో ఆ తండ్రి ఓ ప్రైవేట్ బడిలో ఒకటో తరగతిలో చేర్పిద్దామని వెళ్లగా.. ఫీజు రూ.29,000 అని చెప్పారు. పుస్తకాలు, దుస్తులు, బూట్లు తదితర సామగ్రి అదనంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గతంలో ఇంటికి సమీపంలో ఉన్న ప్రైవేట్ బడిలో యూకేజీకి ఫీజు రూ.12,000 దాక చెల్లించారు. ఒకటో తరగతికి వచ్చే సరికి అదనంగా రూ.17,000తో పాటు ఇతర సామగ్రి భారం పడుతుండటంతో కొత్తబడిలో చేర్పిద్దామనే ఆలోచనకు స్వస్తి పలికి పాత బడిలోనే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు.
Parents on Private School Fee Hike :మరోవైపు అదే సూర్యాపేటకు చెందిన మరోవ్యక్తి బాలకృష్ణ. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిలో ఒకరు యూకేజీ, మరొకరు మూడో తరగతిని స్థానిక ప్రైవేటు స్కూల్లో చదువుకుంటున్నారు. అక్కడ గతేడాది ఇద్దరికిగానూ.. ఫీజు రూ.26,000 తీసుకోగా, ఈ సంవత్సరం అదనంగా రూ.4,000 పెంచారు. ఇతర సామగ్రికి ఇద్దరికి రూ.8000 కట్టించుకున్నారు. ఈ సంవత్సరం అదనంగా మరో రూ.5,000 భారం పెరిగిందని.. వేరే స్కూలులో చేర్పిద్దామంటే అక్కడ ఇంకా ఎక్కువగా ఫీజులు ఉన్నాయని బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ వైపు పిల్లలకు పుస్తకాలు, బూట్లు, దుస్తులు.. మరోవైపు ఫీజుల మోతతో తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. వారి సంపాదన ఏ మాత్రం పెరగకున్నా గానీ, ఒక్కసారిగా ఫీజుల భారం పడటంతో ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అవి ఇవి అంటూ నిలువు దోపిడీకి చేస్తున్నారు. బయట మార్కెట్లో కొనడానికి ఒప్పుకోరు.. వారు చెప్పిన ముద్రణ పుస్తకాలనే కొనాలంటారు. ఇలా జిల్లాలో మాత్రం విద్యావ్యాపారం జోరుగా సాగుతోంది.
ప్రామాణికమంటూ దోపిడీ :సూర్యాపేటజిల్లాలో మొత్తం 244 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 59,490 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలల దోపిడీలపై ఏటా సాక్ష్యాలతో విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. తనిఖీలు మాత్రం చేపట్టడం లేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క బడిపై ఎలాంటి చర్యలు లేవంటే అధికారుల తీరు అర్థమవుతోంది. విద్యాశాఖ జీవో నెం.1కి ఎంతో ముఖ్యమైనది. పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోళ్లపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. బహిరంగ మార్కెట్లో దొరికే పుస్తకాలనే విక్రయించాలని దుస్తులు, బూట్లు, ఇతర సామగ్రిపై నిబంధనలు రూపొందించారు. ఒకవేళ అమ్మినా మార్కెట్ కన్నా.. ధర ఎక్కవగా ఉండవద్దు. కానీ, ప్రైవేట్ పాఠశాలలు యాజమాన్యాలు దీన్ని పక్కన పెడుతూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.