సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని నల్గొండ ఎంపీ, పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. కొవిడ్ వార్డులో ఉన్న బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి యోగక్షేమాలు ఆడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. జిల్లాలో కరోనా విజృంభిస్తున్న వేళ జనరల్ ఆస్పత్రిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవల అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. త్వరలోనే 300 పడకల నుంచి 950 పడకల పీజీ ఆస్పత్రిగా మార్చేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను తగ్గించిందని.. వచ్చిన బాధితుల్లో 20 శాతం మందికే పరీక్షలు చేసి మిగతావారిని కిట్ల కొరత పేరుతో తిప్పిపంపడం బాధాకరమని అన్నారు. తక్షణమే వంద శాతం బాధితులకు పరీక్షలు చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. రాపిడ్ టెస్టుల స్థానంలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడమే శ్రేయస్కరమని అన్నారు. రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలన్నారు.