సూర్యాపేట జిల్లా(suryapet district news) కోదాడ పట్టణ పరిధి కొమరబండకు చెందిన బొల్లం పుల్లయ్య దంపతులది వ్యవసాయ కూలీ కుటుంబం. కుమారుడు వెంకటేష్ 2018లో డిగ్రీ మూడో సంవత్సరం చివరి పరీక్ష రాసి ద్విచక్ర వాహనంపై ఇంటికొస్తుండగా..కోదాడ వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొంది(Bike accident). ఈ ప్రమాదంలో వెంకటేష్ తలకు తీవ్రగాయమైంది. చావు బతుకుల మధ్య ఉన్న కుమారుడిని హైదరాబాద్ మలక్‌పేటలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్పించారు. తలకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. వైద్య ఖర్చుల కోసం ఇల్లు, పుస్తెల తాడు సహా అన్నీ అమ్ముకున్నారు. సరిపోకపోవడంతో గ్రామస్థులు, స్నేహితులు మరో రూ.6 లక్షలు ఇచ్చారు. మొత్తంగా ఇప్పటివరకూ వైద్యానికి రూ.28 లక్షలు ఖర్చుచేశారు.
‘‘శస్త్ర చికిత్సలో భాగంగా మెదడుకు రక్షణగా రెండు వైపులా ఉన్న చిప్పలను వైద్యులు తొలగించారు. తాత్కాలికంగా ప్లాస్టిక్ డిప్పలు అమర్చారు. మరో శస్త్రచికిత్సతో భద్రపరిచిన రెండు చిప్పలను అతికించాల్సి ఉంది. పూర్తిచికిత్సకు మరో రూ.10 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. సీఎం సహాయనిధి కింద కేవలం రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. ఇక మాదగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. తొలగించిన చిప్పలను హైదరాబాద్‌లోని అదే ఆసుపత్రిలో భద్రపరిచారు. భద్రపరిచినందుకే ఏడాదికి రూ.70 వేలు ఖర్చవుతోంది. వాస్తవానికి రెండేళ్లలోపే శస్త్ర చికిత్స జరిపించాల్సి ఉంది. డబ్బు సమకూరకపోవడంతో చేయించలేకపోయాం. జాప్యం జరుగుతుండటంతో ఇటీవల బిడ్డకు అప్పుడప్పుడూ మూర్ఛ వస్తోందని’ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు.